పరువు నిలుపుకున్న శర్వానంద్

Flop movie Ranarangam gets decent TV ratings
Friday, January 10, 2020 - 17:15

భారీ అంచనాల మధ్య రణరంగం సినిమా చేశాడు శర్వానంద్. సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కోసం సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ శక్తివంచన లేకుండా ఖర్చుచేసింది. కాజల్, కల్యాణి ప్రియదర్శిని హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. అలా శర్వా ఖాతాలో మరో పరాజయం చేరింది. అయితే సిల్వర్ స్క్రీన్ పై పోగొట్టుకున్న పరువును బుల్లితెరపై కూసింత నిలబెట్టుకున్నాడు శర్వానంద్.

రణరంగం సినిమా ఈ వారం రేటింగ్స్ లో మెరిసింది. జెమినీ టీవీలో ప్రసారమైన ఈ సినిమాకు 6.32 (అర్బన్) రేటింగ్ వచ్చింది. థియేటర్లలో ఫ్లాప్ అయిన ఈ సినిమాకు బుల్లితెరపై ఈమాత్రం రేటింగ్ రావడం నిజంగా గొప్పదనమే. అయితే రేటింగ్స్ పరంగా శర్వా కెరీర్ లో ఇది హయ్యస్ట్ కాదు. అతడి కెరీర్ లో రేటింగ్ పరంగా ది బెస్ట్ మూవీ శతమానం భవతి.

గతంలో సంక్రాంతి కానుకగా వచ్చిన శతమానం భవతి సినిమాకు ఏకంగా 17 టీఆర్పీ వచ్చింది. దాంతో పోలిస్తే తాజా రేటింగ్ చాలా తక్కువ. కాకపోతే థియేటర్లలో ఫ్లాప్ అయినా టీవీల్లో ఆమాత్రం రేటింగ్ రావడం గొప్పవిషయం. అలా శర్వానంద్ ఉన్నంతలో తన పరువు నిలబెట్టుకున్నాడు. తనకు క్రేజ్ తగ్గలేదని నిరూపించుకున్నాడు.