చిరుకి, కొరటాలకి మధ్య గ్యాపుందా?

Gap between Chiranjeevi and Koratala Siva?
Saturday, April 11, 2020 - 17:45

"అసలు మహేష్ పేరు ఎలా వచ్చిందో తెలియదు. తను కూడా నా బిడ్డ లాంటివాడే. తనతో నటించే అవకాశం వస్తే అద్భుతం. కానీ ఈ సినిమా వరకూ ముందు నుండి రామ్ చరణే అనుకున్నాం. సినిమాలో నాకు శిష్యుడిలాంటి క్యారెక్టర్ అది. ఒకవేళ రాజమౌళిగారు, కొరటాల శివగారు అండర్‌స్టాండింగ్‌కి వస్తే.. ‘ఆచార్య’లో చరణ్‌ ఉండొచ్చు"

చిరంజీవి మొన్నటి  స్టేట్ మెంట్ అది. 

"ఆచార్య" సినిమాలో చరణ్ ఉంటాడా ఉండడా అనేది ఇక్కడ పాయింట్ కాదు. ఆచార్యలో మహేష్ నటించబోతున్నాడనే విషయం తనకు తెలియదని చిరంజీవి చెప్పడం పెద్ద టాపిక్ గా మారిందిప్పుడు. అసలు యూనిట్ లో ఏం జరుగుతుందో చిరంజీవికి చెప్పడం లేదా అనే అనుమానం కూడా తలెత్తుతోంది.

ఓవైపు మహేష్ దగ్గరకెళ్లి కొరటాల కథ మొత్తం చెప్పాడని, మహేష్ కూడా ఓకే చెప్పినట్టు వార్తలు వచ్చేశాయి. పరోక్షంగా కొరటాల కూడా వీటిని నిర్థారించాడు. ఇలాంటి టైమ్ లో మహేష్ పేరు ఎలా తెరపైకొచ్చిందో తనకు తెలియదంటూ చిరంజీవి చెప్పడం విడ్డూరంగా ఉంది.

లేటెస్ట్ గా... త్రిష తప్పుకోవడం గురించి కూడా ఆయన చాలా ఆశ్చర్యం ప్రకటించారు. "మొదట చెప్పిన కథకి, ఆ తర్వాత జరిగిన వాటికి తేడా ఉంది. క్రియేటివ్ విభేదాల వల్లే తప్పుకుంటున్నాను," త్రిష ట్వీట్ చేసింది. ఆ విషయంలో కూడా చిరంజీవికి సమాచారం లేనట్లుంది. అసలు త్రిష ఆలా ఎందుకు తప్పుకుందో తనకి తెలీదని చెప్పారు రీసెంట్ గా.  

అంతకుముందు టైటిల్ విషయంలో కూడా ఇలానే జరిగింది. ఓ చిన్న సినిమా ఫంక్షన్ లో తన సినిమా టైటిల్ బయటపెట్టేశారు చిరంజీవి. ఇవన్నీ చూస్తుంటే.. ఆచార్యకు సంబంధించి చాలా విషయాలు చిరంజీవి వరకు వస్తున్నట్టు కనిపించడం లేదు.