సంక్రాంతి సినిమాలన్నీ ఆ ఛానెల్ లోనే!

Gemini TV to Telecast Sankranthi 2020 biggies
Friday, January 17, 2020 - 19:00

ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలు రెండే రెండు. అవే సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న ఈ రెండు సినిమాల్ని త్వరలోనే ఒకే ఛానెల్ లో చూడబోతున్నాం. అవును.. సంక్రాంతి సినిమాలు రెండింటినీ జెమినీ టీవీ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల్ని ఏఏ అకేషన్లలో ప్రసారం చేయాలనే విషయంపై ఇప్పటికే ఆ ఛానెల్ లో డిస్కషన్ మొదలైంది.

రీసెంట్ గా సైరా సినిమాను ప్రసారం చేసింది ఈ ఛానెల్. అదే తరహాలో 50 రోజులు దాటిన వెంటనే ఈ రెండు సినిమాల్ని ప్రసారం చేయాలని నిర్ణయించింది. గతంలో భారీ మొత్తానికి అజ్ఞాతవాసి సినిమాను దక్కించుకున్న ఈ ఛానెల్... దాదాపు 7 నెలల వరకు ఆ సినిమాను ప్రసారం చేయలేదు. ఈసారి అలాంటి తప్పులు జరగకుండా.. కాస్త ముందుగానే మహేష్, బన్నీ సినిమాల్ని టెలికాస్ట్ చేయబోతోంది.

వీళ్ల నిర్ణయం వెనక మరో బలమైన కారణం కూడా ఉంది. ఈ రెండు సినిమాలు త్వరలోనే డిజిటల్ వేదికలపైకి వచ్చేస్తాయి.

అల వైకుంఠపురం డిజిటల్ రైట్స్ జెమినీ వద్దే ఉన్నాయి. కానీ సన్ నెక్ట్స్ లో 50 రోజుల్లోనే అది వచ్చేయడం ఖాయం. అటు సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ లో 7 వారాలకే వచ్చేస్తోంది. సో.. వీటిని లాంగ్ గ్యాప్ ఇచ్చి టీవీలో ప్రసారం చేస్తే రేటింగ్ పెద్దగా రావడం లేదు. ఈ విషయంలో మహర్షి సినిమా పెద్ద ఎగ్జాంపుల్ గా నిలిచింది. అందుకే ఈ రెండు సినిమాల్ని ఏప్రిల్ 19 లోపు ప్రసారం చేయాలని జెమినీ టీవీ నిర్ణయించింది.

ఇక ఈ రెండు సినిమాలతో పాటు వచ్చిన ఎంత మంచివాడవురా (స్టార్ మా), దర్బార్ సినిమాలు మాత్రం వీటికంటే ముందే టీవీల్లో ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంది.