బాహుబలి చూస్తారు కానీ సైరా చూడరు

Giribabu comments on Chiranjeevi
Wednesday, November 27, 2019 - 07:00

చిరంజీవిపై సునిశితంగా విమర్శలు చేసే సీనియర్ నటుడు గిరిబాబు, ఈసారి సైరాపై కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పటితరానికి సైరా కనెక్ట్ అవ్వదన్నారు గిరిబాబు. సినిమా చూసిన తర్వాత ఇదే విషయాన్ని చిరంజీవికి కూడా చెప్పానని తెలిపారు.

"సైరా చూసి చిరంజీవిని మెచ్చుకున్నాను. అద్భుతమైన సినిమా తీశావని చెప్పాను. కాకపోతే స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత అప్పటి కథతో సినిమా చేశావ్ కాబట్టి యూత్ కు కనెక్ట్ అవ్వదని చెప్పాను. ఇప్పటితరం పాకిస్థాన్ పై యుద్ధం చూస్తారు, క్లబ్బులు-పబ్బులు చూస్తారు. లేదంటే చిరంజీవి డాన్సులు, ఫైట్లు చూస్తారు. అంతే తప్ప స్వతంత్రపోరాటం చూడరు. బాహుబలి లాంటి సినిమాలు చూస్తారు కానీ సైరా చూడరు. ఇదే విషయం చిరంజీవికి చెప్పాను."

అప్పట్లో భగత్ సింగ్, గాంధీ, అల్లూరిపై సినిమాలు తీస్తే ఆడాయని, ఎందుకంటే అప్పటి తరానికి అది కనెక్ట్ అయిందన్నారు గిరిబాబు. కానీ 3 జనరేషన్లు మారిపోయిన తర్వాత ఇప్పుడింకా ఫ్రీడమ్ ఫైట్ అంటే కుర్రాళ్లు చూడరని అన్నారు. చిరంజీవికి తనకు మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేదని, చిరంజీవితో ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్పడం తనకు అలవాటంటున్నారు గిరిబాబు.

"చిరంజీవి నాకు తమ్ముడిలాంటోడు. ఆత్మీయంగా పలకరించి, కౌగలించుకుంటాడు. చాలా మంచి మనిషి. మేమిద్దరం కలిసి చాలా సినిమాలు చేశాం. ఇప్పటికీ ఆ గౌరవం, ఆత్మీయత చూపిస్తుంటాడు. చిరంజీవితో ఏదైనా నేను ఓపెన్ గా మాట్లాడగలను."