పెద్ద మనసు చాటుకున్న గోపీచంద్

Gopichand shows his big heart
Tuesday, April 7, 2020 - 17:15

చిరంజీవి నేతృత్వంలో సాగుతున్న కరోనా క్రైసిస్ ఛారిటీకి ఇప్పటికే దాదాపు టాలీవుడ్ హీరోలంతా డొనేషన్లు ఇచ్చారు. అలా ఇవ్వడమే కాకుండా.. స్వయంగా రంగంలోకి దిగి కొంతమంది హీరోలు తమ పెద్ద మనసు చాటుకుంటున్నారు. గోపీచంద్ కూడా ఈ కోవలోకే వస్తాడు. సీసీసీకి ఇప్పటికే విరాళం అందజేసిన ఈ హీరో.. తాజాగా తనకుతానుగా స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు. లాక్ డౌన్ టైమ్ లో ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు తన వంతుగా సహాయం అందిస్తున్నాడు.

హైదరాబాద్ లో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న వెయ్యి కుటుంబాలకు సాయం అందించాడు గోపీచంద్. ఏకంగా నెల రోజులకు సరిపడా సరుకులు, నిత్యావసరాల్ని అందించి తన పెద్ద మనసు చాటుకున్నాడు. ఇప్పటివరకు చాలామంది నటులు ఇలా ముందుకొచ్చి సహాయసహకారాలు అందజేశారు. అయితే ఇలా ఒకేసారి వెయ్యి మందికి నెల రోజులకు సరిపడా సహకారం అందించింది మాత్రం ఒక్క గోపీచంద్ మాత్రమే.

రచయిత, దర్శకుడు, నటుడు పోసాని 50 కుటుంబాలకు నెలకు సరిపడ నిత్యావసర సరుకుల్ని అందిస్తున్నారు. నిఖిల్, శ్రీవిష్ణు లాంటి హీరోలు కూడా బయటకొచ్చి సహాయం చేస్తున్నారు. అటు వీకే నరేష్ కూడా పేదలకు సహాయ పడుతున్నారు. 'మా' సర్వే చేయించిన‌ 58 మంది సభ్యులకు ఇప్పటికే వారి బ్యాంక్ అకౌంట్‌లో రూ. 10,000 చొప్పున డిపాజిట్ చేశారు.