గోపీచంద్ సినిమా నేరుగా ఓటీటీలోకి

Gopichand's film for direct digital release
Saturday, June 13, 2020 - 14:00

"అమృతారామమ్" అనే సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వకుండా ఓటీటీలోకి వచ్చింది. త్వరలోనే "47-డేస్" అనే మరో సినిమా కూడా థియేటర్లను స్కిప్ చేసి ఓటీటీలోకి వస్తోంది. నవీన్ చంద్ర సినిమాలు కూడా క్యూ కడుతున్నాయి. అయితే ఈ లిస్ట్ లో తొలిసారిగా ఓ పెద్ద హీరో సినిమా చేరబోతోంది. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే గోపీచంద్ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజయ్యే అవకాశం ఉంది.

మూడేళ్ల కిందట "ఆరడుగుల బుల్లెట్" అనే సినిమా చేశాడు గోపీచంద్. నయనతార ఇందులో హీరోయిన్. మంచి స్టార్ కాస్ట్ కూడా ఉంది. కానీ ఆర్థిక కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ప్రస్తుతం ఓటీటీలో సినిమాలకు మంచి రేటు పలుకుతున్న కారణంగా ఈ "బుల్లెట్"ను బయటకు తీయాలని నిర్ణయించుకున్నాడట నిర్మాత రమేష్.

ప్రస్తుతం పలు ఓటీటీలతో నిర్మాత సంప్రదింపులు జరుపుతున్నాడు. రేటు కూడా అందరికీ ఆమోదయోగ్యంగా, అందుబాటులోనే ఉన్నట్టు టాక్. సో.. ఈసారి ఫైనాన్షియల్ తలనొప్పులు లేకపోతే ఓటీటీపైకి "బుల్లెట్" దూసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. 

అంతా ఓకే కానీ పెద్ద డౌట్ ఒకటి అలానే మిగిలి ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఓ వారం రోజుల షెడ్యూల్ బాకీ ఉంది. అది కూడా పాటలు కాదు, టాకీ. పైగా ప్రకాష్ రాజ్ లాంటి నటులు కొంతమంది డబ్బింగ్ ఇంకా పూర్తిగా చెప్పలేదు. మరి అవన్నీ ఎలా మేనేజ్ చేసి సినిమాను షేప్ చేశారనేది తెలియాలి.