ఆ సినిమానే కదా హనూ!

Hanu's new film and Nani's old film
Tuesday, July 28, 2020 - 16:00

చాన్నాళ్ల కిందటి సంగతి.
"కృష్ణగాడి వీరప్రేమగాథ" సినిమా తర్వాత నాని, దర్శకుడు హను రాఘవపూడి కలిసి మరో సినిమా చేద్దామనుకున్నారు. నాని కోసం హను అప్పట్లో ఓ కథ కూడా రాసుకున్నాడు. అదొక మిలట్రీ బ్యాక్ డ్రాప్ సబ్జెక్ట్. బాగా హార్డ్ వర్క్ చేయాల్సిన ప్రాజెక్టు. కాబట్టి అప్పటికప్పుడు ఈ సినిమాను టేకప్ చేయడం సాధ్యం కాదని స్వయంగా నాని ప్రకటించాడు. పైగా అప్పటికి అతని చేతిలో మరో 3 సినిమాలున్నాయి.

అలా ఏళ్లు గడిచినా నాని-హను కాంబో మాత్రం మళ్లీ రిపీట్ కాలేకపోయింది. కట్ చేస్తే, హను రాఘవపూడి ఇప్పుడో సినిమాను ప్రకటించాడు. దుల్కర్ సల్మాన్ హీరో. ఇదొక మిలట్రీ బ్యాక్ డ్రాప్ సినిమా. అతడి మాటల్లోనే చెప్పాలంటే యుద్ధంతో రాసిన ప్రేమకథ ఇది. ఈరోజు ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చిన వెంటనే అందరికీ ఆరోజు నాని-హను కాంబోలో రావాల్సిన సినిమా గుర్తొచ్చింది. అప్పట్లో నాని కోసం అనుకున్న సబ్జెక్ట్ తోనే ఇప్పుడు దుల్కర్ హీరోగా హను సినిమా ప్రకటించాడని అంటున్నారు కొంతమంది.

దీనిపై ఇద్దరు మాత్రమే క్లారిటీ ఇవ్వగలరు. ఒకరు దర్శకుడు హను. రెండు హీరో నాని.