పీకే.. సీకే.. ఇవే నాకిష్టం

Harish opens up about his likes and dislikes
Thursday, September 19, 2019 - 22:45

పీకే అంటే పవన్ కల్యాణ్ అని అర్థం. మరి సీకే అంటే ఏంటి? పైగా దర్శకుడు హరీష్ శంకర్ తనకు ఈ రెండూ ఇష్టం అంటున్నాడు. పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదు. డబుల్ మీనింగ్స్ వెదకాల్సిన అవసరం కూడా లేదు. సీకే అంటే ఓ బ్రాండ్. కెవిన్ క్లెయిన్ ను ముద్దుగా ఇలా సీకే అని పిలుస్తారు. అక్కడున్నది పంచ్ డైలాగ్ లకు పెట్టింది పేరైన హరీష్ శంకర్. అందుకే ఇలా తన ఇష్టాన్ని ప్రాసరూపంలో బయటపెట్టాడు.

"వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. షర్ట్ మార్చుకోమని పక్కనే ఉన్న యాంకర్ చెప్పింది. బ్యాగులో చూస్తే ఈ టీషర్ట్ కనిపించింది. వెంటనే వేసుకున్నాను. పైగా నాకు ఇష్టమైన బ్రాండ్ కెవిన్ క్లెయిన్. నా కలెక్షన్ లో చాలా ఉన్నాయి. కానీ నేను సీకేకు బ్రాండ్ అంబాసిడర్ ను మాత్రం కాదు. పీకే అన్నా.. సీకే అన్నా నాకు చాలా ఇష్టం."

ఇలా దుస్తుల్లో తనకిష్టమైన బ్రాండ్ ను బయటపెట్టాడు హరీష్ శంకర్. వాల్మీకి సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ వెబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఇష్టాల్ని, మిగతా సెలబ్రిటీలపై తన అభిప్రాయాల్ని కుండబద్దలుకొట్టినట్టు చెప్పుకొచ్చాడు హరీష్. వీటిలో పూరి జగన్నాధ్ పై హరీష్ చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. పూరి జగన్నాధ్ 7 రోజులు కూర్చుంటే.. కథ-స్క్రీన్ ప్లే మొత్తం పూర్తిచేస్తాడని.. కానీ 10 రోజులు కూర్చుంటే సూపర్ హిట్ సినిమా స్క్రిప్ట్ రాయగలడని.. కానీ పూరి ఆ పని చేయడని ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చాడు.