'హలో'కు ఆ ప్రచారం కరెక్ట్ కాదేమో!

Hello promoted in mis-leading manner?
Saturday, December 23, 2017 - 18:15

టీజర్ లో యాక్షన్ లుక్ లో అఖిల్ ను చూపించారు. ట్రయిలర్ లో కూడా యాక్షన్ డోస్ కాస్త ఎక్కువే ఉంది. ప్రమోషనల్ ఈవెంట్స్ లో కూడా పార్కోర్ స్టయిల్ ఫైట్స్ ఉన్నాయంటూ ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు.  రిలీజైన ఈ సినిమా చూసిన వాళ్లంతా.. హలో సినిమాను యాక్షన్ మూవీగా ప్రొజెక్ట్ చేసేకంటే.. ఎమోషనల్ లవ్ జర్నీగా ప్రచారం చేసుంటే ఇంకా బాగుండేదని అభిప్రాయపడ్డారు.

హలో సినిమాలో మెయిన్ ఎలిమెంట్స్ లవ్, ఎమోషన్. యాక్షన్ అనేది ఓ పార్ట్ మాత్రమే. నిజానికి ఈ సినిమాలో రెగ్యులర్  ఫైట్స్ పెట్టినా పెద్దగా తేడా ఉండదు. కాకపోతే ఈ సెగ్మెంట్ లో కూడా కొత్తదనం చూపించాలనే మేకర్స్ ప్రయత్నాన్ని అభినందించాలి. కానీ ఆ ఎలిమెంట్ నే ప్రచారంలో ఎక్కువగా చూపించి ప్రేక్షకుల్ని పక్కదోవ తప్పించారేమో అనిపిస్తుంది.

మొత్తమ్మీద హలో సినిమాకు డీసెంట్ టాక్ వచ్చింది. మనసంతా నువ్వే కథకే కాస్త మోడ్రన్ టచ్ ఇచ్చారనే విమర్శ వినిపిస్తున్నప్పటికీ.. ఓవరాల్ ఓకే టాక్ వ‌చ్చింది. కనీసం పోస్ట్-రిలీజ్ ప్రమోషన్ లో అయినా హైలెట్ అయిన ఎలిమెంట్స్ ను వాడితే బెటర్.