హిందీలో 'హిట్' అవుతుందా?

Hit to be remade into HIndi
Tuesday, May 26, 2020 - 13:00

హిట్.. తెలుగులో ఈమధ్య కాలంలో క్లిక్ అయిన సినిమా. నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమాలో క్లైమాక్స్ పై కొన్ని విమర్శలున్నప్పటికీ.. ఓవరాల్ గా మంచి థ్రిల్లర్ అనిపించుకుంది ఈ మూవీ. ఇప్పుడీ సినిమాను బాలీవుడ్ కు తీసుకెళ్లాలని భావిస్తున్నాడట నిర్మాత దిల్ రాజు. ఈ మేరకు నిర్మాత నాని నుంచి రీమేక్ రైట్స్ దక్కించుకున్నట్టు కూడా చెబుతున్నారు.

అంతా బాగానే ఉంది కానీ బాలీవుడ్ లో రీమేక్ చేసేంత స్థాయి హిట్ సినిమాకు ఉందా అనేది ఇక్కడ డిస్కషన్ పాయింట్. ఎందుకంటే బాలీవుడ్ జనాలకు థ్రిల్లర్లు కొత్తకాదు. గడిచిన దశాబ్ద కాలంగా ఎన్నో మంచిమంచి థ్రిల్లర్లు వచ్చాయక్కడ. హిట్ సినిమాలో పాయింట్, ఆ టేకింగ్ మనకు కొత్త కావొచ్చు కానీ బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం ఇప్పటికే అలాంటి సినిమాలు చాలా చూసి ఉన్నారు.

మరి సినిమాలో ఏ పాయింట్ నచ్చి దిల్ రాజు హిట్ ను హిందీలో రీమేక్ చేయాలని భావిస్తున్నాడో అతడికే తెలియాలి. ఒకవేళ ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకుంటే భారీ మార్పులతోనే చేస్తారట. శైలేష్ కొలను ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు.

దిల్ రాజు ఇప్పటికే పలు సినిమాల్ని హిందీలో చేస్తానని ప్రకటించాడు. వీటిలో సెట్స్ పైకి వచ్చింది జెర్సీ రీమేక్ మాత్రమే. ఎఫ్2 కూడా హిందీలో రీమేక్ చేయాలని చూస్తున్నాడు కానీ నటీనటులు దొరకడం లేదు. ఇక హిట్ రీమేక్ ఎప్పటికి కార్యరూపం దాలుస్తుందో చూడాలి.