హిట్ సినిమాకి శాటిలైట్ నహీ!

HIt movie streaming on Amazon
Wednesday, April 1, 2020 - 23:15

లాక్ డౌన్ తో చిన్నాచితకా సినిమాలన్నీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఓ పిట్టకథ, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, సవారి, త్రీ మంకీస్, లైఫ్ అనుభవించు రాజా లాంటి ఎన్నో సినిమాలు డిజిటల్ మాధ్యంలోకి వచ్చేయగా.. తాజాగా "హిట్" సినిమా కూడా ఆన్ లైన్లోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఈ సినిమా ఇవాళ్టి నుంచి ప్రత్యక్షమైంది.

సంక్రాంతి సినిమాల తర్వాత కాస్త సక్సెస్ టాక్ తెచ్చుకున్న సినిమాల్లో "భీష్మ" తర్వాత లిస్ట్ లో ఉన్నది హిట్ మూవీ మాత్రమే. నాని నిర్మించిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. అక్కడక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నప్పటికీ.. ఓవరాల్ గా మంచి థ్రిల్లర్ అనిపించుకుంది ఈ సినిమా.

అయితే  ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లోకి రావడానికి లాక్ డౌన్ కు లింక్ లేదు. రిలీజైన 4 వారాలకు డిజిటల్ లో వేసుకునే అగ్రిమెంట్ మీదే ఈ సినిమా లాక్ అయింది. ఒప్పందం ప్రకారమే ఇది స్ట్రీమింగ్ కు వచ్చింది. అన్నట్టు ఈ సినిమాకు ఇంకా శాటిలైట్ డీల్ లాక్ అవ్వలేదు. నాని ఇంతకుముందు నిర్మించిన "అ!" అనే సినిమాతో పాటు ఇప్పుడు "హిట్" సినిమా కూడా శాటిలైట్ కు నోచుకోలేదు.