తెలుగు సినిమా 2019: హాట్ టాపిక్స్

Hot topics in 2019 in Telugu movie industry
Wednesday, December 18, 2019 - 10:30

సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ వాటికి సంబంధించిన కొన్ని విశేషాలు మాత్రం హాట్ టాపిక్ గా నిలిచిపోతాయి. అందులో కొన్ని కాంట్రవర్సీస్ ఉంటాయి, కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. ఇలా సందర్భం ఏదైనా ఆ టైమ్ కు అది హాట్ టాపిక్. 2019లో కూడా అలాంటి సూపర్ హాట్ టాపిక్స్ కొన్ని ఉన్నాయి.

అమ్మరాజ్యంలో కడపబిడ్డలు
నిజానికి ఈ సినిమా అసలు పేరు కమ్మరాజ్యంలో కడపరెడ్లు. ప్రస్తుత ఏపీ రాజకీయాలపై సెటైరిక్ గా తీసిన ఈ సినిమా అత్యంత వివాదాస్పదమైంది. సెన్సార్ కత్తెర్లతో పాటు టైటిల్ కూడా మార్చాల్సి వచ్చింది. విషయం హైకోర్టు వరకు కూడా వెళ్లింది. ఒక దశలో సినిమా కూడా వాయిదాపడింది. అలా ఈ సినిమాతో మరోసారి సంచలనాలకు కేంద్రబిందువయ్యాడు రామ్ గోపాల్ వర్మ.

గద్దలకొండ గణేష్
ఈ సినిమా కూడా హాట్ టాపిక్ గా మారింది. రిలీజ్ తర్వాత అంతా కంటెంట్ గురించి మాట్లాడుకుంటే, రిలీజ్ కు ముందు మాత్రం కేవలం టైటిల్ గురించే మాట్లాడుకున్నారు. ఈ సినిమాకు వాల్మీకి అనే టైటిల్ పెట్టారు. దీనిపై ఓ వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. దీంతో ఆఖరి నిమిషంలో టైటిల్ మార్చారు. రేపు రిలీజ్ అనగా, రాత్రికిరాత్రి టైటిల్ మార్చడంతో ఈ సినిమా హాట్ టాపిక్ అయిపోయింది.

సామజవరగమన సాంగ్
ఈ ఇయర్ కచ్చితంగా మాట్లాడుకోవాల్సిన హాట్ టాపిక్స్ లో సామజవరగమన సాంగ్ కూడా ఒకటి. మొన్నటివరకు ఆలుమా డోలుమా, రౌడీ బేబీ, కొలవరిడీ లాంటి పాటలే యూట్యూబ్ సెన్సేషన్స్ గా ఉండేవి. అవన్నీ తమిళ పాటలే. ఫస్ట్ టైమ్ సామజవరగమన అనే అచ్చతెలుగు పాట సునామీలా సోషల్ మీడియాను కమ్మేసింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అనే తేడా లేకుండా అన్ని భాషల శ్రోతలు ఈ పాటను ఎంజాయ్ చేశారంటే, ఆ మ్యూజిక్ లో మత్తు, గమ్మత్తు అర్థంచేసుకోవచ్చు. తమన్ కంపోజ్ చేసిన ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడాడు. ఇప్పటికే ఈ సాంగ్ ను 11 కోట్ల మందికి పైగా యూట్యూబ్ లో చూశారు. బన్నీ నటించిన అల వైకుంఠపురములో సినిమాలోనిది ఈ సాంగ్.

మా అసోసియేషన్ ఎన్నికలు
2019 ఎన్నికల్లో మా అసోసియేషన్ ఎన్నికలు కూడా హాట్ టాపిక్ గా మారాయి. జనరల్ ఎలక్షన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా మా అసోసియేషన్ ఎన్నికల ప్రచారంలో స్టార్స్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. శివాజీరాజా ప్యానెల్ పై నరేష్-రాజశేఖర్ ప్యానెల్ ఓ రేంజ్ లో కామెంట్స్ చేసింది. దీన్ని శివాజీరాజా ప్యానెల్ కూడా అదే స్థాయిలో తిప్పికొట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికల్లో నరేష్-రాజశేఖర్ ప్యానెల్ విజయం సాధించింది.

అర్జున్ సురవరం టైటిల్ వివాదం
ముద్ర అనే పేరు విన్నారా.. ఆ మధ్యంతా మీడియాలో బాగా నలిగిన పేరు. లెక్కప్రకారం నిఖిల్ సినిమా ఇదే టైటిల్ తో రావాలి. కానీ ఆఖరి నిమిషంలో పేరు మార్చారు. ముద్ర అనే టైటిల్ తో నట్టికుమార్ ఆల్రెడీ సినిమా చేయడం, విడుదల చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ముద్ర మూవీ కాస్తా, అర్జున్ సురవరంగా మారింది. ఇలా టైటిల్ తో పాటు వరుస వాయిదాలతో కూడా హాట్ టాపిక్ గా మారింది ఈ మూవీ. ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా నిఖిల్ కెరీర్ లో హిట్ గా నిలిచింది.

సాహో కాంట్రవర్సీ
భారీ బడ్జెట్ తో వచ్చిన సాహో సినిమాపై కూడా విడుదల తర్వాత వివాదం చెలరేగింది. తెలుగులో ఈ సినిమా నిరాశపరిచిందనేది ఒక పాయింట్ అయితే, అజ్ఞాతవాసి సినిమానే కాస్త ఇటుఅటు మార్చి మళ్లీ తీశారనేది మరో పాయింట్. చివరికి ఒరిజినల్ మూవీ అయిన లార్గో వించ్ డైరక్టర్ కూడా సాహోపై స్పందించడంతో వివాదం ముదిరిపోయింది. అలా సాహో సినిమా బడ్జెట్ పరంగానే కాకుండా, ఈ విధంగా కూడా హాట్ టాపిక్ గా మారింది.

AA20 ఎనౌన్స్ మెంట్
2019 కాంట్రవర్సీస్ లో దీనికి కూడా స్థానం ఉంది. అప్పటివరకు సుకుమార్-మహేష్ కాంబినేషన్ ఫిక్స్ అనుకున్నారు. కట్ చేస్తే, మహేష్ కాంపౌండ్ నుంచి సుకుమార్ తప్పుకోవడం.. వెంటనే బన్నీతో సినిమా ఎనౌన్స్ చేయడం చకచకా జరిగిపోయాయి. మహేష్ కు చెప్పిన కథతోనే బన్నీతో సినిమా చేయబోతున్నాడు సుక్కూ. అప్పట్లో ఈ వ్యవహారం దాదాపు వారం రోజుల పాటు హాట్ టాపిక్ గా మారింది.