100 కోట్ల లక్ష్మిబాంబ్

Hotstar bags Laaxmi Bomb for 100 Crores
Saturday, May 30, 2020 - 15:30

 థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేందుకు చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. కానీ వాస్తవంగా మాట్లాడుకుంటే అన్నీ చిన్న సినిమాలే. ఇటు జ్యోతిక, కీర్తిసురేష్ నటించిన సినిమాలైనా, అటు బాలీవుడ్ లో బిగ్ బి చేసిన సినిమా అయినా బడ్జెట్ పరంగా చిన్నవే. వాటి మార్కెట్ వాల్యూ కూడా తక్కువ. కానీ తొలిసారి ఓ భారీ బడ్జెట్ సినిమా, భారీ అంచనాలున్న సినిమా థియేటర్లను మిస్ కొట్టి, ఓటీటీపైకి రాబోతోంది. దానిపేరు లక్ష్మీబాంబ్.

అవును.. స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ఈ సినిమాను డిస్నీ హాట్ స్టార్ దక్కించుకుంది. దాదాపు 120 కోట్ల రూపాయల మొత్తానికి ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ తీసుకున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. అది కంప్లీట్ అయిన వెంటనే హాట్ స్టార్ తో కుదుర్చుకున్న డీల్ ను అధికారికంగా బయటపెట్టబోతున్నారు.

నిజానికి 120 కోట్ల అంటే ఓటీటీకి పెద్ద మొత్తమేమో కానీ అక్షయ్ కుమార్ బాక్సాఫీస్ స్టామినాకు అది ఏమంత పెద్ద మొత్తం కాదు. తన ప్రతి సినిమాతో వంద కోట్ల కలెక్షన్లు రాబట్టే అక్షయ్ కు లక్ష్మీబాంబ్ తో ఆ మొత్తాన్ని కలెక్ట్ చేయడం పెద్ద సమస్య కాదు. పైగా అక్షయ్ ఇప్పుడు మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు.

కాకపోతే కరోనా కారణంగా లాక్ డౌన్ పడి థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో అర్థంకాని పరిస్థితి. తెరుచుకున్న తర్వాత కూడా ఇంతకుముందులా ప్రేక్షకులు తండోపతండాలుగా వస్తారోరారో కూడా చెప్పలేం. పైగా ఇప్పుడు లక్ష్మీబాంబ్ కు మంచి రిలీజ్ డేట్ కూడా దొరకడం లేదు. అందుకే అన్నీ ఆలోచించి లక్ష్మీబాంబ్ ను ఓటీటీకి ఇచ్చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే జులై చివరి వారం లేదా ఆగస్ట్ మొదటివారంలో ఈ సినిమా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వస్తుంది.