పెళ్లికి మెంటల్లీ ప్రిపేర్ కాలేదింకా

I am not mentally prepared for the idea of marriage: VD
Tuesday, February 11, 2020 - 20:00

ఇకపై ప్రేమకథల జోలికి వెళ్లనని ప్రకటించి సంచలనం సృష్టించాడు విజయ్ దేవరకొండ. పనిలోపనిగా రియల్ లైఫ్ లో ప్రేమపై కూడా స్పందించాడు. కొంతమంది ఇలా ప్రేమలో పడి అలా బ్రేకప్ చెబుతారని, అదేం ప్రేమో తనకు అస్సలు అర్థంకాదంటున్నాడు. అయితే అసలైన ప్రేమ అంటే ఏంటో ఈమధ్యే తెలుసుకున్నానంటున్నాడు

"ప్రేమ అనేది నాన్సెన్స్ అనుకున్నాను ఒకప్పుడు. ప్రేమ విషయంలో కూడా నా లైఫ్ లో చాలా దశలున్నాయి. నేను కొంతమంది చూశాను. ప్రేమలో పడతారు, ఆ వెంటనే బ్రేకప్ అంటారు. ఆశ్చర్యకరంగా బ్రేకప్ తర్వాత మళ్లీ లవ్ లో పడతారు. మాదే నిజమైన ప్రేమ అంటారు. అదేందో నాకు అర్థంకాదు. చాలా కన్ఫ్యూజన్ ఉండేది. కానీ తర్వాత మెల్లగా నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసుకున్నాను. జీవితంలో ప్రేమ అవసరం. లైఫ్ మొత్తం చూసుకుంటే.. మనం చేసిన పనులు, కష్టాలు, డబ్బులు ఇవేవీ గుర్తుకురావు. మన అమ్మానాన్న లేదా తమ్ముడు లేదా ఫ్రెండ్ లేదా భార్య లేదా పిల్లల ప్రేమ మాత్రమే గుర్తొస్తుంది. అదే నిజమైన ప్రేమ."

కాస్త వేదాంతంలా అనిపిస్తోంది కదా. నిజమే ఈసారి దేవరకొండ కాస్త ఎక్కువగానే వేదాంతం వల్లించాడు. నేను కూడా మనిషిలా మారుతున్నానని ప్రకటించిన దేవరకొండ, తన మాటల్లో కూడా కాస్త తేడా చూపించే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా ప్రేమపై సాఫ్ట్ గా స్పందించిన విజయ్, పెళ్లిపై కూడా తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు.

"లైఫ్ లో పెళ్లి చేసుకుంటా. కానీ ప్రస్తుతానికి నేను అప్పుడే పెళ్లికి సిద్ధంగా లేను. వయసు చూసుకుంటే, ఇంట్లో పెద్దరికం పరంగా చూసుకుంటే నేను అడల్ట్ అనే ఫీలింగ్ వస్తుంది. కానీ పెళ్లి టాపిక్ వచ్చేసరికి మాత్రం నేనింకా పిల్లాడ్నే కదా అనిపిస్తుంది. దీనికి కారణం పెళ్లికి నేను మెంటల్లీ ప్రిపేర్ అవ్వకపోవడమే."

"వరల్డ్ ఫేమస్ లవర్" ప్రమోషన్ లో భాగంగా ఇలా ప్రేమ-పెళ్లిపై తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం పూరి జగన్నాధ్ తో చేస్తున్న లైగర్ సినిమా ఈ రెండు పదార్థాలకు దూరంగా ఉంటుందంటున్నాడు. సినిమా చూసి మెంటల్ ఎక్కిపోతుందని కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు.