చిరంజీవిని ఫాలో అవ్వను : బన్నీ

I don't follow megastar Chiranjeevi: Allu Arjun
Tuesday, June 20, 2017 - 17:45

మెగా కాంపౌండ్ కు చెందిన ఏ హీరో అయినా తనకు స్ఫూర్తి మెగాస్టార్ అని చెబుతాడు. నటన, డాన్స్ విషయంలో చిరంజీవిని ఫాలో అయిపోతుంటాం అని కామన్ గా చెప్పేస్తుంటారు. గతంలో బన్నీ కూడా ఇలానే చెప్పి ఉంటాడు. కానీ ఇప్పుడు మాత్రం మాట మార్చాడు. చిరంజీవిని తను ఎట్టిపరిస్థితుల్లో ఫాలో అవ్వనని అంటున్నాడు. తన స్టయిల్ తనకుంది అని చెబుతున్నాడు.

"మెగాస్టార్ ను అనుకరించాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. అందుకే చిరంజీవి సాంగ్స్ రీమిక్స్ చేయను.. సరదాగా డైలాగ్ చెబుతా, స్టెప్ వేస్తా తప్ప చిరంజీవిని మ్యాచ్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. నా ఒరిజినాలిటీలో నేను ఉండాలనుకుంటాను.. నేను ఎప్పుడూ ఇమిటేట్ చేయను," కుండబద్దలుకొడుతూ బన్నీ చెప్పిన సమాధానం ఇది.

"ఎవరి స్టయిల్ వాళ్లది,.. ఎవరి ఇమేజ్ వాళ్లది.. బయట జనాలు చూసి ఎన్నయినా అనుకోవచ్చు. వంద రకాలుగా చెప్పుకోవచ్చు. కానీ అవేవీ నేను పట్టించుకోను. చిరంజీవి అంటే నాకు చాలా గౌరవం. చాలా ఇష్టం. కానీ వర్క్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం నేను చిరంజీవిని ఫాలో అవ్వను. నా స్టయిల్ నాది. వర్క్ మాత్రమే కాదు.. లైఫ్ లో ఎవరి ఇండివిడ్యువాలిటీ వాళ్లకు ఉండాలి. అలాంటి వాళ్లే నాకు నచ్చుతారు."