సినిమాలు చేసే ఆలోచ‌న లేదు: ప‌వ‌న్

I will not do movies right now, says Jana Sena leader Pawan Kalyan
Monday, January 22, 2018 - 23:30

"ప్రస్తుతానికి ఏ సినిమా చేసే ఆలోచన లేదు. పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెడతాను," అని ఖ‌రాఖండీగా తేల్చి చెప్పారు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌. అజ్ఞాత‌వాసి త‌ర్వాత ఆయ‌న చేసే సినిమా ఏంట‌నే విష‌యంలో ఎన్నో ఊహాగానాలు సాగుతున్నాయి. వాట‌న్నింటికి తాళం వేశారు ఒక్క ప్రెస్‌మీట్‌తో. సోమ‌వారం సాయంత్రం క‌రీంన‌గ‌ర్‌లో ఆయ‌న విలేక‌ర్ల‌తో ముచ్చ‌టించారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో జ‌న‌సేన పార్టీని ఎలా సంస్థాగ‌తంగా డెవ‌ల‌ప్ చేయ‌నున్నారో, త‌మ పార్టీ ల‌క్ష్యాలేంటో వివ‌రించారు ప‌వ‌ర్‌స్టార్‌.

జ‌న‌సేన ఏక‌సేన‌లా క‌నిపిస్తోంది!
ఏ పార్టీలో అయినా పార్టీ ప్రెసిడెంట్ హైలెట్ అవుతుంటారు. టీడీపీలో అయినా, టీఆర్ ఎస్‌లో అయినా, వైస్సార్సీలో అయినా ఇంతే క‌దా. నేను ఇపుడు చెప్పిన పార్టీల నిర్మాణానికి చాలా కాలం ప‌ట్టింది. మా పార్టీ కూడా సంస్థాగ‌తంగా ఎదుగుతోంది. దానికి కొంత‌ స‌మ‌యం ప‌డుతుంది. ఇపుడు జ‌న‌సేన అంటే నేనే అన్న‌ట్లుగా అనిపించొచ్చు. రాను రాను ప‌రిస్థితి మారుతుంది. మా పార్టీలో ఇత‌ర వ్య‌క్తులు ఫోక‌స్‌లోకి వ‌స్తారు. ఇపుడు పార్టీ నిర్మాణ పనిలోనే ఉన్నాను. ఈ టూర్ కూడా అందుకే.

స‌డెన్‌గా తెలంగాణ‌పై ఫోక‌స్ పెట్టారు...
ఇక్క‌డ నాకు చాలా మంది అభిమానులు ఉన్నారు. తెలంగాణ అంటే నాకు అమితమైన ప్రేమ, ఇష్టం. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో మొద‌ట నేను ఏపీపై దృష్టి పెట్టాను. ఐతే, నేను ఏపీకే ప‌రిమితం అయితే ఇక్క‌డి స‌మ‌స్య‌లు, ఇక్క‌డి ప్ర‌జల ఆకాంక్ష‌ల గురించి మాట్లాడ‌లేను. అందుకే రెండు చోట్లా పార్టీని డెవ‌ల‌ప్ చేస్తున్నాం.

త్వ‌ర‌లో చిరంజీవి కూడా మీ పార్టీలోకి వ‌స్తారా?
జ‌న‌సేన‌లో అన్న‌య్య హ‌స్తం లేదు. నేను జ‌న‌సేన స్థాపించ‌డానికి, చిరంజీవి గారికీ ఎలాంటి సంబంధమూ లేదు. ఇది నా అంత‌టా నేనుగా తీసుకున్న నిర్ణయం. 

ఇక‌పై పూర్తిగా రాజ‌కీయాల‌కే ప‌రిమితం అవుతారా?
ప్రస్తుతానికి ఏ సినిమా చేసే ఆలోచన లేదు. పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెడతా.