స్వ‌ర‌మాంత్రికుడికి ఏమైంది?

IIlayaraaja humiliates security guar for getting on stage at concert
Tuesday, June 4, 2019 - 22:30

‘అహంకారం వల్ల ఏర్పడే అంధకారం చీకటి కంటే భయంకరమైనది’ అని పెద్దవాళ్ళు చెబుతారు. పది మందికీ చెప్పే స్థాయిలో ఉన్న పెద్దవారే ఆ అంధకారంలో పడితే జాలిపడటం తప్ప ఏమీ చేయలేం. ఇసై జ్ఞాని అని కీర్తింపబడే ఇళయరాజా పాట‌లు అంటే ప‌డిచ‌చ్చే వారి సంఖ్య కోట్ల‌లో ఉంటుంది. ప్ర‌పంచం అంతా నిన్ను వ‌దిలేసినా.. నీ వెంట ఉండేది ఇళ‌య‌రాజా సంగీతమే అని కూడా అభిమానులు అంటారు. భార‌తీయ సినీ సంగీత ప్ర‌పంచంలో ఇళ‌య‌రాజా అంత గొప్ప‌వారు ఎవ‌రూ లేరు ఇపుడు. ఆయ‌న గొప్ప‌త‌నం వేరు ఆయ‌న అరోగ‌న్స్‌, సెల్ఫ్ అస్సెర్టివ్ ప్ర‌వ‌ర్త‌న వేరు. అంత గొప్ప క‌ళాకారుడు కూడా ఇలా ప్ర‌వ‌ర్తిస్తారా అనిపిస్తుంటుంది కొన్ని సంఘ‌ట‌న‌లు చూస్తే.....

ఇటీవలి కాలంలో ఆయన మాటల ధోరణి, ప్రవర్తన... తనను తాను పలుచన చేసుకొనే రీతిలో ఉంటున్నాయి. ఆయన జన్మదినం సందర్భంగా నిర్వహించిన మ్యూజికల్ షోలో ఇళయరాజా తీరు గమనిస్తే – అహంకార ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. 

వేదికపైన ఉన్న వాద్యకారులకు తాగు నీరు అంధించిన పాపానికి ఒక సెక్యూరిటీ గార్డుని వేదిక మీదకు పిలిచి తిట్టిన విధానం ఇళయరాజా స్థాయికి ఏ మాత్రం తగదు. వాద్యకారులు దాహంతో ఉండటంతో గార్డుతో నీళ్ళ బాటిల్స్ ఇప్పించారు. ఆ విషయం తెలుసుకోకుండా ఆ చిరుద్యోగిపై సంగీత జ్ఞాని తన వాచాలత్వంతో తిట్టిపోశారు. అంతటితో ఆగితే ఏముంది... ఆ గార్డు సంగీత జ్ఞాని గారి కాళ్ళ మీద పడి మన్నింపు కోరితేగానీ వదల్లేదు. అదే అహంకారంతో కార్యక్రమానికి వచ్చిన ప్రేక్షకుల్నీ తిట్టిపోశారు. తక్కువ రేటుకి టిక్కెట్లు కొనుక్కొని ఎక్కువ రేటు టికెట్ సీట్లలో కూర్చొన్నారు అంటూ అవమానకరంగా మాట్లాడారు. అలా కూర్చోనీయడం అనేది నిర్వాహకుల తప్పు.

ఇటీవల ‘96’ అనే తమిళ సినిమా బృందం మీదా, ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మీదా కూడా దారుణమైన విమర్శలు చేశారు. ’96 కాలం నాటి కథ కావడంతో నాటి ఇళయరాజా పాటలను వినిపించారు. దీనిపై రాజా మాట్లాడుతూ నేటి సినిమా మ్యూజిక్ డైరెక్టర్ల‌కి క్రియేటివిటీ లేదు, నపుంసకులు అంటూ దుమ్మెత్తిపోశారు. తన పాటలు వాడుకున్నందుకు అభ్యంతరం చెప్పడాన్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ సభ్యతగా మాట్లాడాలి అనే విషయాన్ని ఇసై జ్ఞాని మరిచారు. ఆ ట్యూన్స్ కి సంబంధించి అన్ని లీగల్ ఫార్మాలిటీస్ ముందే పూర్తిచేశామని 96 టీం చెబుతోంది. 

కొన్నాళ్ళ కిందట కూడా ఎస్పీ బాలు విషయంలోనూ ఇళయరాజా ఇబ్బందికరంగానే ప్రవర్తించారు. కొద్ది రోజుల కిందటే మళ్ళీ కలిసి పనిచేశారు. రాజా పుట్టినరోజున నిర్వహించిన షోలో బాలుతోపాటు ఏసుదాస్ కూడా పాల్గొన్నారు.

ఇళయరాజా ప్రవర్తనలో విద్వత్ గర్వం కనిపించడం లేదు. ఆ విద్వత్ గర్వం ఉంటే రాజాకు హుందాతనాన్నే ఇచ్చేది. అహంకార ధోరణి... తన జ్ఞానానికి ఇవ్వాల్సినంత విలువ ఈ సమాజం ఇవ్వడం లేదు...  అనే భావం కనిపిస్తున్నాయి. 

ఇళయరాజా- యోగులను, అవధూతలను విశ్వసించి... భక్తి ఆధ్యాత్మిక అంశాల్లో ఎంతో ఉన్నతంగా ఉంటారు అని ఆయన్ని అభిమానించే వంశీ లాంటి దర్శకులు చెబుతారు. వాటి ద్వారా సాధించిన జ్ఞానం అంతా అహం అనే అంధకారంలోనే ఉండిపోయింది. నిజమే... ‘అహంకారం వల్ల ఏర్పడే అంధకారం చీకటి కంటే భయంకరమైనది’.