ఇలియానా రూటు మార్చబోతోందా?

Is Ileana turning anchor on a sports channel?
Thursday, April 16, 2020 - 18:15

తెలుగులో ఇలియానా ఎప్పుడూ ఛాన్సుల కోసం వెంపర్లాడిన సందర్భాల్లేవు. ఆమె కోసం టాలీవుడ్డే ఎగబడింది. బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత కూడా ఇలియానాను ఇటువైపు లాగడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఇలియానా మాత్రం ఎప్పుడూ టాలీవుడ్ పై కనికరం చూపించలేదు. చివరికి బాలీవుడ్ లో అవకాశాలు తగ్గినప్పుడు కూడా, తెలుగులో అమర్-అక్బర్-ఆంటోనీకి భారీ రెమ్యూనరేష్ తీసుకుందామె.

కట్ చేస్తే, ఇప్పుడు ఇలియానాకు మరోసారి టాలీవుడ్ వైపు చూసే పరిస్థితి వచ్చింది. బాలీవుడ్ లో ఆమె చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. అది కూడా ఎలాంటి క్రేజ్ లేని అభిషేక్ బచ్చన్ సినిమా. ఈ ఒక్క సినిమా మినహా, మరే భాషలో ఆమెకు అవకాశాల్లేవు. మరోవైపు బాయ్ ఫ్రెండ్ తో విడాకులు (అన్-అఫీషియల్ గా) కూడా అయిపోవడంతో మానసిక ఆనందం కూడా లేకుండా పోయింది.

ఇలాంటి టైమ్ లో కూడా ఇలియానా తగ్గడం లేదు. వస్తున్న తెలుగు ఆఫర్లకు భారీగా డిమాండ్ చేస్తోంది. అంతేకాదు.. ఇప్పుడు కెరీర్ లో ప్రత్యామ్నాయాల కోసం కూడా చూస్తోంది. హీరోయిన్ గా ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ గోవా బ్యూటీ.. ఇప్పుడు యాంకర్ గా మారబోతోంది. అది కూడా ఓ స్పోర్ట్స్ ఛానెల్ లో.

అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఓ స్పోర్ట్స్ ఛానెల్ లో వ్యాఖ్యాతగా ప్రత్యక్షం కాబోతోంది ఇలియానా. ఈ మేరకు ఇల్లీ బేబ్ కు భారీ ప్యాకేజీ అఫర్ చేసింది సదరు ఛానెల్. అయితే ఇదంతా కరోనాకు ముందు వ్యవహారం. ఇప్పుడు కరోనా వచ్చింది. మీడియాను బలితీసుకుంది. అదే ప్యాకేజీ ఇలియానాకు ఉందో లేదో తేలాల్సి ఉంది.