మొన్న సందీప్ రెడ్డి.. ఈసారి దేవరకొండ

Imposters are on the prowl
Wednesday, March 4, 2020 - 18:00

మొన్నటికిమొన్న సందీప్ రెడ్డి వంగ పేరుతో ఓ అగంతకుడు హీరోయిన్లకు ఫోన్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. రాహు హీరోయిన్ కృతి గార్గ్ తో పాటు ఓ టీవీ యాంకర్ కూడా ఈ అగంతకుడి వలలో పడ్డారు. కానీ సేఫ్ గా బయటపడ్డారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ పేరుతో మరో కేటుగాడు బయల్దేరాడు.

విజయ్ దేవరకొండ పేరుతో ఓ అగంతకుడు నకిలీ ఫేస్ బుక్  ఎకౌంట్ స్టార్ట్ చేశాడు. అవకాశం ఇస్తానంటూ అమ్మాయిలను వలలో వేయడం ప్రారంభించాడు. తన ఫేస్ బుక్ ఖాతాలో కేవలం అమ్మాయిల ఫ్రెండ్ రిక్వెస్టుల్ని మాత్రమే యాక్సెప్ట్ చేసేవాడు. మెసెంజర్ లో ఛాటింగ్ లు చేసేవాడు. సహజీవనం చేద్దామంటూ అడిగేవాడు.

కొంతమంది ద్వారా ఈ వ్యవహారం అసలైన విజయ్ దేవరకొండ వరకు వెళ్లింది. దీంతో స్వయంగా విజయ్ దేవరకొండ రంగంలోకి దిగాడు. తన అసిస్టెంట్ గోవింద్ ద్వారా అతడికి టచ్ లోకి వెళ్లాడు. అగంతకుడికి అమ్మాయిగా పరిచయమైన గోవింద్, అతడి నుంచి అన్ని విషయాలు రాబట్టాడు. చివరికి వాట్సాప్ మొబైల్ నంబర్ కూడా సంపాదించగలిగాడు.

ఈ ఆధారాలన్నింటి ద్వారా అతడిపై కేసు నమోదుచేశాడు విజయ్ దేవరకొండ. కేసు ఫైల్ చేసిన పోలీసులు త్వరలోనే అతడ్ని పట్టుకుంటామని చెబుతున్నారు. అమ్మాయిలూ జాగ్రత్త.. ఫోన్ చేసిన ప్రతి ఒక్కడు సందీప్ రెడ్డి కాడు, ఛాట్ చేసిన ప్రతి ఒక్కడు విజయ్ దేవరకొండ కాడు. మోసపోవద్దు.