ఇందిర, ఎన్టీఆర్ సీన్‌....అస‌లు ఐడియా ఇదా!?

Indira Gandhi and NTR scene getting trolled in NTR Mahanayakudu trailer
Sunday, February 17, 2019 - 10:30

ఎన్టీఆర్ బ‌యోపిక్ స్ర్కిప్ట్‌ని మొద‌ట రూపొందించింది డాక్ట‌ర్ ఎల్‌.శ్రీనాథ్‌. కుబుసం వంటి సినిమాలు తీసిన ద‌ర్శ‌కుడు శ్రీనాథ్‌...నిర్మాత‌ విష్ణు ఇందూరి ప్రోత్సాహంతో ఎన్టీఆర్ జీవిత క‌థ‌ని స్ర్కిప్ట్‌గా రాశాడు.  ఆ క‌థ‌ని ద‌ర్శ‌కుడు తేజ కొంత డ్ర‌మ‌టైజ్‌ చేశారు. అలా మొద‌లైంది ఎన్టీఆర్ మూవీ. 

ఫిల్మ్‌న‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న స‌మాచారం ప్ర‌కారం..

అపుడు రాసుకున్న స్ర్కిప్ట్ (అపుడు మొద‌టి భాగం, రెండో భాగం అంటూ లేదు..మొత్తం ఒక‌టే మూవీ) ఎలా మొద‌ల‌వుతుందంటే....

సీన్ 1

ఒక పెద్ద కాన్వాయ్ ఆగి ఉంటుంది. ప్ర‌త్యేక‌ విమానం నుంచి చీర‌క‌ట్టుకున్న ఒక పులిలాంటి మ‌హిళ  దిగి న‌డుచుకుంటూ వ‌స్తుంది. అధికారులు, రాజ‌కీయ నాయకులు అంద‌రూ వంగి వంగి న‌మ‌స్క‌రిస్తున్నారు. ఆమె కారు ఎక్కగానే కాన్వాయ్ క‌దులుతుంది. అప్ప‌టి వ‌ర‌కు ఆమె ఫేస్‌ని చూపించ‌రు. కారు విండో నుంచి ప‌రిస‌రాలు చూస్తూ వెళ్తున్న ఆమెకి.. కొద్ది దూరంలో ఒక భారీ కృష్ణుడి విగ్ర‌హం క‌నిపిస్తుంది. అప్ర‌క‌టిత చ‌ర్య‌లా ఆమె ఆ దేవుడికి న‌మ‌ష్క‌రిస్తుంది. 

క‌ట్ టు

ప‌క్క‌న ఉన్న అధికారి: మేడం ... అది దేవుడి విగ్ర‌హం కాదు.. ఒక క‌టౌట్‌.. 
ఆమె: మ‌రి దేవుడిలా క‌నిపిస్తోందే...
అధికారి: ఇపుడు మీరు ఎన్నిక‌ల ప్ర‌చారం స్టేజ్‌పై తిట్ట‌బోయేది ఆ దేవుడి రూపాన్నే.... హి ఈజ్ ఎన్టీఆర్‌... ది డెమీగాడ్ ఆఫ్ మాసెస్‌...

క‌ట్ టు

క్లోజ‌ప్‌లో ప్ర‌ధాని ఇందిరాగాంధీ ఫేస్‌...

క‌ట్ టు

ఫ్లాష్‌బ్యాక్‌..

ఎక్స్ట్రీమ్ క్లోజ‌ప్‌లో.. సైకిల్ చక్రాలు.. సైకిల్‌పై రెండు పాల‌బిందెలు.
ఓపెన్ చేస్తే...
త‌ల‌కి తువ్వాలు క‌ట్టుకొని.. లుంగీ ధ‌రించిన ఓ యువ‌కుడు పాలు అమ్మేందుకు సైకిల్‌పై వెళ్తున్న సీన్‌...అక్క‌డి నుంచి ఎన్టీఆర్ జీవిత క‌థ మొద‌లు..

---టైటిల్స్ రోల్‌-----

ఇలా రాసుకున్నార‌ట మొద‌ట స్క్రిప్ట్‌.... (నిజంగా ఇలా రాసుకుంటే అతిశ‌యోక్తిగా అనిపించినా.. ఇంట్ర‌డిక్ష‌న్‌ ఎలివేష‌న్‌కి ప‌నికొచ్చేలా బావుంద‌ని చెప్పాలి)

క్రిష్ వ‌చ్చిన త‌ర్వాత త‌నదైన శైలిలో స్ర్కిప్ట్‌ని మార్చేశాడనేది టాక్‌. సావిత్రి బ‌యోపిక్ మ‌హాన‌టి స్పూర్తితో క‌థ‌ని ఆసుప‌త్రిలో ఓపెన్ చేశాడట‌. బ‌స‌వ‌తారకం క్యాన్స‌ర్ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ..ఆమె త‌న భ‌ర్త చిన్న‌ప్ప‌టి ఫోటోని చూసి జ్ఞాప‌కాల మబ్బుల్లోకి వెళ్ల‌డం..అక్క‌డి నుంచి క‌థ మొద‌లు కావ‌డం జ‌రిగింది. క్రిష్ ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని రెండు భాగాలుగా మార్చాడు. మొద‌టి భాగంలోనే ప్ర‌ధాని ఇందిరాగాంధీని చూపించాడు ద‌ర్శ‌కుడు క్రిష్‌. ఆల్రెడీ ఆమె ఎన్టీఆర్ గురించి తెలుసుకొంది... ప‌ద్మ‌శ్రీ అవార్డు ఇచ్చే స‌మ‌యంలోనే...

మ‌ళ్లీ రెండో భాగంలో ఆమె ఎన్టీఆర్ కృష్ణుడి రూపాన్ని గుర్తుప‌ట్ట‌న‌ట్లు... కొత్త‌గా క‌టౌట్‌కి దండాలు పెడుతున్న‌ట్లు చూపించ‌డం ఎబ్బెట్టుగా ఉంది. అందుకే ఇపుడు ట్ర‌యిల‌ర్‌లో ఆ షాట్‌ని చూసి ట్రాలింగ్ మొద‌ల‌యింది. రాంగోపాల్ వ‌ర్మ అయితే ఏకంగా రీల్‌లో ఇది, రియాల్టీలో ఇది అంటూ ఒక ఫోటోని కూడా షేర్ చేశారు.  ఇక్క‌డే స్కిప్ట్ ప‌రంగా లోపం చేశారు క్రిష్‌. మొద‌టి భాగంలో ప‌ద్మ‌శ్రీ అపుడు ఇందిరా సీన్ అయినా పెట్ట‌కుండా ఉండాల్సింది...రెండో భాగంలో ఈ సీన్ చూపిద్దామ‌నుకున్న‌పుడు. 

ఇది సోష‌ల్ మీడియా కాలం. సందు దొరికితే ట్రోలింగ్‌తో ఉతికి ఆరేస్తారు. మొద‌ట రాసుకున్న స్క్రిప్ట్ ప్ర‌కారం వెళ్లి ఉంటే ఈ ట్రోలింగ్ ఉండేది కాదు. ఇపుడు మొద‌టి భాగం ఫ్లాప్ అయింద‌ని మ‌ళ్లీ అదే సీన్‌ని అసంబ‌ద్దంగా ఇపుడు పెట్ట‌డంతోనే ఈ స‌మ‌స్య‌.

ఇందిరాగాంధీ ఏం ఖ‌ర్మ ..ఆఖ‌రికి గోర్బేచెవ్‌, రోనాల్డ్ రీగ‌న్ కూడా ఎన్టీఆర్‌కి దండాలు పెట్టార‌ని చూపించినా చూపిస్తార‌ని సెటైర్లు ప‌డుతున్నది ఇందుకే.