ఈసారి హిట్ గ్యారెంటీ

Interview: Varun Tej talks about Fidaa
Wednesday, July 19, 2017 - 16:15

ఫిదా సినిమా కచ్చితంగా హిట్ అవుతుందంటున్నాడు వరుణ్ తేజ్. ఈసారి మెగా ఫ్యాన్స్ అంతా ఫుల్  హ్యాపీగా ఫీల్ అవుతారని కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. ఫిదా గురించి మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడాడు.

శేఖర్ కమ్ముల సినిమాల్లో స్టోరీ ఉండదు

శేఖర్ కమ్ముల సినిమాల్లో స్ట్రాంగ్ స్టోరీ ఏం ఉండదు. సెన్సిబుల్ గా ఉంటుంది. ఫిదా కూడా అలానే ఉంటుంది. ఎమోషన్స్ క్యారీ చేయడంలో ఆయన దిట్ట. మనింట్లో జరిగే సన్నివేశాలతో కథను అల్లారు. చాలామంది ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు.

మెడిసిన్ చదివే ఎన్నారై నేను

సినిమాలో మెడిసిన్ చదివే ఎన్నారై కుర్రాడిగా కనిపించబోతున్నాను. రియల్ లైఫ్ లో నాకు మెడిసిన్ చదవాలని లేదు. పదో తరగతిలోనే సైన్స్ వదిలేశాను.

నాకు హీరోయిజం అక్కర్లేదు

కథలు కొన్ని నాలో స్ఫూర్తి రగిల్చాయి. అందుకే హీరో అయ్యాను. నా సినిమాల్లో హీరోయిజం ఉండాలని అనుకోను. కంచెలో ప్రత్యేకంగా హీరోయిజం ఉండదు. ఫిదాలో కూడా కథ, క్యారెక్టర్ నచ్చి ఒప్పుకున్నాను. హీరోయిజం ఉందా లేదా అనేది నేను పట్టంచుకోను.

మా ఫ్యాన్స్ గురించి నాకు తెలుసు

మా ఫ్యాన్స్ కచ్చితంగా ఈ సినిమాను లైక్ చేస్తారు. సినిమాలోంచి ఓ ఫైట్ ను తీసేసినంత మాత్రాన వాళ్లకు నచ్చదని అనలేం. ఫ్యాన్స్ గురించి నాకు బాగా తెలుసు. ఈ సినిమా కంటెంట్ ను టీజర్ నుంచే చూపిస్తున్నాం. మీరు ఊహించనిది ఈ సినిమాలో ఉండదు. అంతా ఊహించినట్టే ఉంటుంది.

హీరోయిన్ పొట్టిగా ఉంటే ఏంటి?

అమ్మాయి మరీ పొట్టిగా ఉందని డైరక్టర్ కు ముందే చెప్పాను. ఆపిల్ బాక్స్ పెట్టి అమ్మాయిని హైట్ చేస్తారా అని కూడా అడిగాను. నాకు ఇలానే నచ్చింది, క్యూట్ గా ఉందన్నారు కమ్ముల. బయట రెస్పాన్స్ కూడా బాగుండడంతో పొట్టిగా ఉన్నప్పటికీ అలానే షూటింగ్ చేశాం.

కమ్ముల సినిమాల్లో ఫాస్ట్ గా కంప్లీట్ అయింది ఇదే

ఫిదా సినిమా చాలా రోజులుగా షూటింగ్ చేస్తున్నామని అంతా అనుకున్నారు. కానీ అనుకున్న షెడ్యూల్స్ కంటే 5-6 రోజులు ఎక్కువ చేశామంతే. షూటింగ్ మధ్యలో నాకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల లేట్ అయినట్టు మీకు అనిపిస్తోంది. అంతకుమించి మరే రీజన్ లేదు.

మిస్టర్ బాగా డిసప్పాయింట్ చేశాడు

మిస్టర్ రిజల్ట్ తో నిజంగానే నిరాశ చెందాను. అభిమానులు చాలా ఫీల్ అయ్యారు. ఎలా ఒప్పుకున్నారు ఇలాంటి సినిమా అంటూ కొందరు ప్రశ్నించారు. కొన్ని సందర్భాల్లో తప్పులు జరుగుతుంటాయి. కానీ మిస్టర్ విషయంలో మరీ అంత డిజాస్టర్ అవుతుందని మేం అనుకోలేదు. ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటానని అభిమానులకు ఆడియో ఫంక్షన్ లో మాటిచ్చాను.

నాన్నకు బాగా నచ్చింది

మా నాన్న (నాగబాబు) సినిమా చూశారు. ఆయన చాలా హ్యాపీ. నేనింకా చూడలేదు. ఈరోజు లేదా రేపు చూస్తా. మా నాన్నకు యాక్షన్ సినిమాలంటే ఇష్టం. కానీ ఆయనకు ఫిదా నచ్చింది. దర్శకుడు, సినిమాటోగ్రఫర్ వర్క్ గురించి మంచిగా మాట్లాడారు.

ఫిదాలో ఒకే ఒక్క స్టెప్

ఈ సినిమాలో ఒకటే స్టెప్ వేశాను. ఆ ఒక్క స్టెప్ తో స్టిల్ ను సీడీ కవర్ పై పెట్టారు. అంతకుమించి సినిమాలో డాన్స్ లేదు. అస్సలు స్టెప్పులు లేవు. నాకు కూడా హ్యాపీగా అనిపించింది. అన్నీ మాంటేజ్ సాంగ్స్.

వర్క్ షాప్ బాగా పనికొచ్చింది

క్యారెక్టర్స్ కు సంబంధించి ఈ సినిమా కోసం వర్క్ షాప్ చేశాం. గతంలో కూడా వర్క్ షాప్ చేశాం కానీ ఫిదా కోసం క్యారెక్టర్స్, డైలాగ్స్ లాంటి విషయాల్లో వర్క్ షాప్ చేశాం. సాయి పల్లవి, నాకు మధ్య కెమిస్ట్రీ కోసం కమ్ముల ఎక్కువగా వర్క్ షాప్ చేశారు. కచ్చితంగా మా కెమిస్ట్రీ మీకు నచ్చుతుంది.

తన బ్యానర్ లో సినిమా చేయమని చెర్రీ అడిగాడు

మరికొన్నికథలు విన్నాను. వర్క్ జరుగుతోంది. ఫిదా రిలీజ్ తర్వాత చెబుతా. మరోవైపు రామ్ చరణ్ బ్యానర్ లో కూడా చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. రాత్రి కూడా మాట్లాడుకున్నాం. మంచి కథ కోసం చూస్తున్నాం. తన బ్యానర్ లో చేయమని చరణే నన్ను అడిగాడు. మొహమాటం కొద్దీ నేను అడగలేదు.