లాక్ డౌన్లో ఇర్ఫాన్ కు తుది వీడ్కోలు

Irrfan Khan last rites performed amid lockdown
Wednesday, April 29, 2020 - 19:15

ఓ ప్రముఖుడు కన్నుమూస్తే ఆ తర్వాత చాలా తతంగం ఉంటుంది. అతడి పార్థిక దేహాన్ని ఇండస్ట్రీ పెద్దలంతా సందర్శిస్తారు. ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత భారీ ఎత్తున అతడికి తుది వీడ్కోలు పలుకుతారు. కానీ దేశంమెచ్చిన నటుడు ఇర్ఫాన్ ఖాన్ విషయంలో ఇలాంటివేం లేవు. ఇంకా చెప్పాలంటే ఆయన అంత్యక్రియలు, అత్యంత సాదాసీదాగా, గుంభనంగా జరిగిపోయాయి.

ముంబయిలోని కోకిలాబెన్ హాస్పిటల్ లో కన్నుమూసిన కొన్ని గంటలకే ఇర్ఫాన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ మేరకు కుటుంబసభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వెర్సోవా కర్బస్తాన్ లో ఖననం చేసినట్టు ప్రకటించారు. కేవలం కొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్య, పోలీస్ బందోబస్త్ తో కొన్ని గంటల వ్యవథిలోనే ఇర్ఫాన్ అంతిమయాత్ర ముగిసింది. ఇంతకుమించి ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి. 

ముంబయిలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రతి రోజూ వందల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సిటీలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. దీంతో ఇర్ఫాన్ ను చివరి చూపు చూసేందుకు కూడా ఎవ్వరికీ వీలుపడలేదు. విశాల్ భరధ్వాజ్, కపిల్ శర్మ లాంటి ఇద్దరు ముగ్గురు ప్రముఖులు మాత్రమే ఇర్ఫాన్ అంతిమయాత్రలో పాల్గొన్నారు.

దేశం మెచ్చిన ఓ మంచి నటుడికి, తుది వీడ్కోలు మాత్రం అంత మంచిగా జరగలేదు. విధి రాత అంటే ఇదేనేమో.