దించేస్తారా.. పెద్ద మీటింగ్ అందుకేనా?

Jeevitha responds on Maa controversy
Monday, October 21, 2019 - 22:45

మాలో మేం కొట్టుకుంటాం. ఎవ్వరూ వేలు పెట్టడానికి వీల్లేదు. అన్నట్టుంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వ్యవహారం. రెండు గ్రూపులు అసోసియేషన్ లో చాలా రచ్చ చేస్తున్నాయి. చివరికి అంతా కలిసి అధ్యక్షుడిగా ఉన్న నరేష్ ను కిందకు దించేయాలని ప్లాన్ చేస్తున్నారనేది వాస్తవం. దీనిపై మండిపడ్డ నరేష్, లాయర్ నోటీసు కూడా ఇచ్చిన విషయం బయటకు పొక్కింది. ఈ మొత్తం వ్యవహారంపై ఆదివారం మీటింగ్ పెట్టినప్పటికీ, వివరాల్ని మాత్రం బయటకు పొక్కనీయకుండా జాగ్రత్తపడ్డారు. మీడియా మాత్రం ఈ విషయాన్ని గట్టిగానే హైలెట్ చేసింది.

ఇలా మరోసారి "మా"వ్యవహారం మీడియాకు ఎక్కడంతో దీనిపై వివరణ ఇవ్వక తప్పలేదు. స్వయంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కమిటీ జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్ మీడియా ముందుకొచ్చారు. నిన్నటి మీటింగ్ వివరాలు చెప్పలేదు కానీ, మరో బాంబ్ మాత్రం పేల్చారు. ఎక్స టార్డనరీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని నిన్నటి సమావేశంలో నిర్ణయించినట్టు జీవిత ప్రకటించారు.

"మా"లో మొత్తం అటుఇటుగా వెయ్యి మంది సభ్యులున్నారు. వీళ్లందరితో ఓ ఎక్స్ టార్డనరీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని నిర్ణయించినట్టు జీవిత తెలిపారు. అయితే ఈ మీటింగ్ పెట్టాలా వద్దా అనే అంశానికి సంబంధించి సభ్యులందరి అనుమతి కోరినట్టు తెలిపారు. రూల్స్ ప్రకారం, 20శాతం సభ్యులు ఓకే అంటే మీటింగ్ పెడతామని అంటున్నారు జీవిత.

అంతా బాగానే ఉంది కానీ ఇప్పటికిప్పుడు ఈ ఎక్స్ టార్డనరీ జనరల్ బాడీ మీటింగ్ ఎందుకనే విషయంపై జీవిత స్పందించలేదు. చాలా బేధాభిప్రాయాలు ఉన్నాయని, వాటిని తొలిగించుకోవాలంటే సభ్యులంతా సమావేశం కావాల్సిందేనని అంటున్నారమె. నరేష్ ను దృష్టిలో పెట్టుకొని పరోక్షంగా జీవిత ఈ వ్యాఖ్యలు చేశారనే విషయం ఇక్కడ అర్థమౌతూనే ఉంది.

అయితే పరుచూరి లాంటి పెద్దలే ఆదివారం నాటి మీటింగ్ నుంచి బాధపడుతూ వెళ్లిపోయిన వేళ.. ఎక్స్ టార్డనరీ జనరల్ బాడీ మీటింగ్ కు ఎంతమంది మొగ్గుచూపుతారనేది అనుమానాస్పదంగా మారింది. ఒకవేళ అదే కనుక జరిగితే.. ఈసారి సభలో కొట్టుకోవడం గ్యారెంటీ అంటున్నారు "మా" వ్యవహారం బాగా తెలిసిన కొంతమంది పెద్దమనుషులు.