సినిమా ఫ్లాపు.. హైప్ లో తోపు

Johnny turns 17 years
Saturday, April 25, 2020 - 18:00

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ ఎలా ఉండేదో చూడాలనుకుంటే టైమ్ మెషీన్ ఎక్కి జానీ రోజుల్లోకి వెళ్లిపోవాల్సిందే. అప్పట్లో ఆ సినిమా కోసం కుర్రాళ్లంతా ఎదురుచూశారు. ఇంకా చెప్పాలంటే బాహుబలి-2 కోసం ఆమధ్య జనాలు ఎలా వెయిట్ చేశారో.. అంతకంటే ఎక్కువగా జానీ కోసం ఎదురుచూశారనడంలో ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు.

సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, ఖుషీ.. ఇలా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు ఇచ్చిన తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకొని జానీ చేశాడు పవన్. ఆ రెండేళ్లు ఈ సినిమా కోసం జనాలు ఓ రేంజ్ లో ఎదురుచూశారు. అలా థియేటర్లలోకొచ్చిన ఈ సినిమా ఇవాళ్టితో (ఏప్రిల్ 25) 17 ఏళ్లు పూర్తిచేసుకుంది.

సినిమా ఫ్లాప్ అయినా జానీ గురించి చెప్పుకోవాల్సింది చాలా ఉంది. ఫైట్స్, ఫ్రేమ్స్, టేకింగ్ పరంగా అప్పట్లో ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్. అంతేకాదు, ప్రీ-రిలీజ్ బిజినెస్ లో కూడా ఇది అప్పటికే రికార్డు సృష్టించిన ఇంద్రను క్రాస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యథికంగా 250 ప్రింట్స్ తో రిలీజైన తొలి తెలుగు సినిమా ఇదే.ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ పవన్ కల్యాణే. పవన్ డైరక్ట్ చేసిన తొలి-చివరి సినిమా ఇదే. ఈ సినిమాలో రేణుదేశాయ్ హీరోయిన్ గా నటించడమే కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా వర్క్ చేసింది. ఎడిటింగ్ పర్యవేక్షణ కూడా ఆమెదే. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా కిక్ బాక్సింగ్ నేర్చుకున్నాడు పవన్. ఏడాది ప్రాక్టీస్ చేశాడు.

ఇలా ఎన్నో ప్రత్యేకతలతో రిలీజైన జానీ సినిమా.. ఎంటర్ టైన్ మెంట్ లేకపోవడం, నిడివి ఎక్కువగా ఉండడం, స్క్రీన్ ప్లో కన్ఫ్యూజింగ్ గా ఉండడం వల్ల ఫ్లాప్ అయింది. అయినప్పటికీ పవన్ అభిమానులకు ఇది అప్పటికీ ఎప్పటికీ ప్రత్యేకమైన సినిమానే.