టాలీవుడ్ కి బంపర్ మంత్ ...జులై

July sentiment for Tollywood
Thursday, August 1, 2019 - 20:00

డిసెంబర్ నెల నాగార్జునకు సెంటిమెంట్. జులై నెల రాజమౌళికి సెంటిమెంట్. జనవరి బాలయ్యకు సెంటిమెంట్. కానీ టోటల్ టాలీవుడ్ కు ఓ సెంటిమెంట్ ఉంది. అదే జులై నెల. అవును.. గడిచిన ఐదేళ్లుగా జులై నెలలో ఠంచనుగా ఓ హిట్ పడుతోంది. మరీ ముఖ్యంగా అది సర్ ప్రైజ్ హిట్ కావడం విశేషం. 

ఈ ఏడాది జులైలో ఇస్మార్ట్ శంకర్ వచ్చింది. నిజంగా ఇది సర్ ప్రైజ్ హిట్. పూరి-రామ్ ఫ్రెష్ కాంబినేషన్. మూడేళ్లుగా ఫ్లాపులిస్తున్నాడు పూరి. రీసెంట్ గా సరైన హిట్ కొట్టలేదు రామ్. ఇలాంటి ఇద్దరు కలిసి ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇది ఎవరూ ఊహించని విజయం.

గతేడాది కూడా ఇలాంటి సర్ ప్రైజ్ హిట్ పడింది. అదే ఆర్ఎక్స్100. ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ఎవ్వరికీ ఎలాంటి అంచనాల్లేవ్. ట్రయిలర్ లో అడల్ట్ కంటెంట్ చూసి కాస్త కుర్రాళ్లు ఉత్సాహపడ్డారంతే. కట్ చేస్తే, థియేటర్లలోకి వచ్చిన తర్వాత సెన్సేషనల్ హిట్ అయింది. హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్ ను ఓవర్ నైట్ స్టార్స్ ను చేసింది.

2017లో కూడా ఇలాంటి ఆశ్చర్యకరమైన రిజల్ట్ ఒకటుంది. దాని పేరు ఫిదా. ఎలాంటి అంచనాల్లేకుండా సైలెంట్ గా షూటింగ్ జరుపుకొని ఆ ఏడాది జులైలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వరుణ్ తేజ్ కు తొలి బ్లాక్ బస్టర్ అందివ్వడంతో పాటు.. సాయిపల్లవిని స్టార్ హీరోయిన్ గా మార్చేసింది. 

2016 జులైలో కూడా ఇలాంటి ఓ సర్ ప్రైజ్ హిట్ ఉంది. అదే పెళ్లిచూపులు సినిమా. విజయ్ దేవరకొండను లైమ్ లైట్ లోకి తీసుకొచ్చిన ఈ సినిమా, ఊహించని విజయాన్నందుకుంది. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని, నిర్మాతలు కూడా ఊహించలేదు. ఓ ఇంటర్వ్వూలో వాళ్లు ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు కూడా. ఇప్పుడు స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ కెరీర్ కు పునాది ఈ సినిమానే.

ఇక 2015 జులైలో అయితే చరిత్ర తిరగరాసే సినిమా వచ్చింది. అదే బాహుబలి-ది బిగినింగ్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమా, అప్పటివరకు తెలుగు సినీచరిత్రలో ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసింది. ఈ సినిమా విడుదలై ఐదేళ్లు గడిచినా ఇప్పటికీ కొన్ని రికార్డులు బాహుబలి పేరిట అలానే ఉన్నాయి. ఇలా గడిచిన ఐదేళ్లుగా టాలీవుడ్ లో జులై నెలలో ఒక సర్ ప్రైజ్ హిట్ వస్తూనే ఉంది.