మొన్న రాధ, నేడు సీత
తేజ దర్శకత్వంలో మరోసారి నటిస్తోంది కాజల్ అగర్వాల్. ఆమెని తెలుగుతెరకి పరిచయం చేసింది అతనే. తేజ తీసిన "లక్ష్మీ కల్యాణం" సినిమాతో ఆమె అరంగేట్రం చేసింది. ఆ తర్వాత పదేళ్ల గ్యాప్ తర్వాత గతేడాది రానా హీరోగా ఆయన రూపొందించిన నేనే రాజు నేనే మంత్రిలోనూ నటించింది. ఈ సినిమా బాగా హిట్టయింది. అందులో రాధ అనే రాయలసీమ యువతిగా నటించి మెప్పించింది. అదే సెంటిమెంట్‌తో ఆమెని తన తాజా సినిమాలోనూ రిపీట్ చేశాడు.
బెల్లంకొండ హీరోగా తేజ రూపొందిస్తున్న సినిమాలో కాజల్ హీరోయిన్. ఆమెపైనే సినిమా కథ అంతా నడుస్తుందట. ఇప్పటివరకు బెల్లంకొండ పక్కా మాస్ హీరోగా, గాల్లో విలన్‌లని లేపి మరీ కొడుతున్న క్యారక్టర్స్ చేస్తూ వస్తున్నాడు. ఈ సారి మాత్రం చంటి తరహా పాత్రలో కనిపిస్తాడట. ఈ స్వాతిముత్యాన్ని దారిలో పెట్టే సీతగా కాజల్ నటిస్తోంది. అందుకే ఈ సినిమాకి "సీత" అనే పేరుని ఫిక్స్ చేశారట.
కాజల్ అగర్వాల్, బెల్లంకొండ కాంబినేషన్‌లో ఇంతకుముందు వచ్చిన "కవచం" సినిమా ఆడలేదు. కానీ సీత మాత్రం కథాబలంతో రూపొందుతోందట. బెల్లంకొండని నేలమీదకి తీసుకొచ్చే కథనట.
- Log in to post comments