మెగా అల్లుడుకి నెగెటివ్

Kalyaan Dhev tests negative for corona
Monday, July 13, 2020 - 16:30

తెలంగాణ ప్రభుత్వం షూటింగ్స్ కు పర్మిషన్ ఇచ్చిన వెంటనే సెట్స్ పైకి వెళ్లాడు మెగా అల్లుడు కల్యాణ్ దేవ్. సూపర్ మచ్చి సినిమా ప్యాచ్ వర్క్ పూర్తిచేశాడు. అయితే ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు ఈ హీరో తన ఇంటికి వెళ్లలేదు. భార్యాపిల్లలకు దూరంగా ఉంటూ వచ్చాడు. షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా కొన్ని రోజులు తనకు తానుగా స్వీయ నిర్బంధంలో ఉండిపోయాడు.

అలా ఇన్నాళ్లూ ఇంటికి దూరంగా ఉన్న కల్యాణ్ దేవ్, ఎట్టకేలకు తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. అయితే ఇక్కడ కూడా కల్యాణ్ దేవ్ ముందుజాగ్రత్తలు తీసుకున్నాడు. కుటుంబాన్ని కలుసుకునేముందు కరోనా టెస్ట్ చేయించుకున్నాడు ఈ హీరో. టెస్టుల్లో నెగెటివ్ వచ్చిన తర్వాతే  ఇంట్లో అడుగుపెట్టాడు.

"సూపర్ మచ్చి" సినిమాను వీలైనంత తొందరగా రెడీ చేసి ఓటీటీలో రిలీజ్ చేసే ఆలోచనలో యూనిట్ ఉంది. అందుకే ఇప్పటికే ఆలస్యమైన ఈ సినిమాను త్వరగా పూర్తిచేసేందుకు.. కరోనా పరిస్థితుల మధ్య లొకేషన్ కు వెళ్లి, షూట్ పూర్తిచేశాడు కల్యాణ్ దేవ్.