క‌మ‌ల్‌హాస‌న్ అట్ట‌ర్‌ఫ్లాప్ షో

Kamal Haasan's political debut flop show
Thursday, May 23, 2019 - 22:30

క‌మ‌ల్‌హాస‌న్ న‌టించిన రీసెంట్ సినిమాలు ఎలా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొడుతున్నాయో...ఆయ‌న రాజ‌కీయ అరంగేట్రం కూడా అట్ట‌ర్‌ఫ్లాప్ షోగా మిగిలింది. గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మ‌క్క‌ల్ నీది మ‌య్యం (ఎం.ఎన్‌.ఎం) పేరుతో పార్టీని స్థాపించి.. త‌మిళ‌నాడు ఎన్నిక‌ల బ‌రిలో దింపారు పార్టీని. ఈ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో త‌మిళ‌నాడులోని  39 సీట్ల‌లో త‌న పార్టీ త‌ర‌ఫును అభ్య‌ర్థులను నిలిపారు. ప్ర‌ధానంగా రూలింగ్ అన్నాడిఎంకే పార్టీని, బీజేపీని టార్గెట్ చేస్తూ క‌మ‌ల్‌హాస‌న్ ప్ర‌చారం చేశారు.

ఐతే స్టాలిన్ అధ్వ‌ర్యంలోని డీఎంకే త‌మిళ‌నాట అత్య‌ధిక లోక్‌స‌భ సీట్ల‌ని కైవ‌సం చేసుకొంది. క‌మ‌ల్‌హాస‌న్ పార్టీకి వ‌చ్చింది గుండు సున్నా. కేవ‌లం 12 స్థానాల్లో మాత్రం ఆయ‌న పార్టీ మూడో స్థానంలో నిలిచింది. మిగ‌తా అన్ని చోట్ల డిపాజిట్లు కూడా ద‌క్క‌లేదు. 

క‌మ‌ల్‌హాస‌న్ పొలిటిక‌ల్ ప‌వ‌ర్ ఏంటో అరంగేట్రంలోనే తేలిపోయింది. ముందు నుంచి రాజ‌కీయ విశ్లేష‌కులు ఊహిస్తున్న‌ట్లే క‌మ‌ల్‌హాస‌న్ ఏ మాత్రం ఓట‌ర్ల‌ని ఆక‌ట్టుకోలేక‌పోయారు. సోష‌ల్ మీడియాలో జై కొట్టే బ్యాచ్‌, థియేట‌ర్ల వ‌ద్ద హంగామా చేసే అభిమానుల వ‌ల్ల గెల‌వ‌డం క‌ష్ట‌మ‌ని క‌మ‌ల్ కూడా ప్రూవ్ చేశారు. 

క‌మ‌ల్ ఎంట్రీ చూసిన త‌ర్వాత ర‌జ‌నీకాంత్ కూడా ద‌డుసుకొని త‌న ప్లాన్‌ని మార్చుకుంటారా అనేది చూడాలి. ర‌జ‌నీకాంత్ కూడా రాజ‌కీయ పార్టీని ప్ర‌క‌టించి రెండేళ్లు కావొస్తోంది. ఐతే ఆయ‌న ఇంత‌వ‌ర‌కు ఆ విష‌యంలో అడుగు ముందుకెయ్య‌లేదు.