మీడియాను ఏకి పడేసిన కంగన

Kangana Ranaut slams Bollywood media
Saturday, June 20, 2020 - 17:30

సుశాంత్ ఆత్మహత్యతో హీరోయిన్ కంగనా రనౌత్ రగిలిపోతోంది. ఇప్పటికే బాలీవుడ్ లో ఓ సెక్షన్ పెద్ద మనుషుల్ని, కొందరు పెద్ద హీరోల్ని ఓ రౌండ్ వేసుకున్న కంగనా.. తాజాగా బాలీవుడ్ మీడియాను టార్గెట్ చేసింది. నటీనటుల జీవితాల్ని బాలీవుడ్ లో ఓ సెక్షన్ మీడియా ఎలా ప్రభావితం చేస్తుందో.. బ్లైండ్ స్టోరీస్ పేరిట ఎలాంటి కథనాల్ని రాస్తుందో విపులంగా వివరించింది.

సుశాంత్ పై కూడా ఓ సెక్షన్ బాలీవుడ్ మీడియా అలాంటి కథనాల్ని ఇచ్చిందని, నేరుగా సుశాంత్ పేరు చెప్పకుండా అతడి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడమే కాకుండా.. మెంటల్ ప్రెషర్ కు కారణమైందని కంగనా ఆరోపించింది. కేవలం ఆరోపించడం కాదు.. కొన్ని బాలీవుడ్ సంస్థలు ఏ టైమ్ లో సుశాంత్ పై ఎలాంటి వార్తలు ఇచ్చాయో ఉదాహరణలతో సహా చదివి వినిపించి చాకిరేవు పెట్టింది కంగన.

సుశాంత్ సెక్స్ చేసినప్పుడు ఏం చేస్తాడంటూ ఓ కథనం గతంలో వచ్చింది.. సుశాంత్ ఓ ట్రక్ డ్రైవర్ గా కనిపిస్తాడంటూ మరో కథనం. పబ్ పార్టీ లో సుశాంత్ ఓ డైరక్టర్ తల పగలగొట్టాడంటూ మరో స్టోరీ. సుశాంత్ తన సహనటిని రేప్ చేశాడని, మీటూ మూమెంట్ లో భాగంగా ఏ క్షణానైనా జైలుకు వెళ్తాడంటూ మరో స్టోరీ గతంలో వచ్చింది. వీటన్నింటినీ సదరు వెబ్ సైట్లు పేర్లు, తేదీ-సమయం చెప్పి మరీ ప్రస్తావించింది కంగనా.

పేరు చెప్పకుండా.. మిగతా వివరాలన్నీ చెప్పి ఆ హీరో ఎవరో గుర్తొచ్చేలకు ఓ అవగాహన వచ్చేలా ఇలాంటి అబద్ధపు కథనాలు ఇచ్చారని.. ఇలాంటి వాటితో సుశాంత్ మానసిక స్థైర్యం బాగా దెబ్బతిందని కంగనా చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా బాలీవుడ్ మాఫియాను వెనకేసుకొస్తున్న మీడియాను చెడుగుడు ఆడుకుంది.

తనపై కూడా కొందరు జర్నలిస్టులు కక్షకట్టారని, నలుగురు జర్నలిస్టులు కోటరీగా ఏర్పడి తనపై చెడు ప్రచారం చేయడానికి ప్రయత్నించారని.. దేశవ్యాప్తంగా దాదాపు 3వేల మంది మీడియా జనాలు తనకు వ్యతిరేకంగా వార్తలు రాశారని.. తన సినిమా రిలీజై హిట్టయిన వెంటనే అంతా పరారైపోయారని చెప్పుకొచ్చింది కంగనా.