కంపు కంపు చేసిన కనికా

Kanika Kapoor creates ruckus with her statements
Tuesday, March 24, 2020 - 22:45

బాలీవుడ్ నుంచి మొట్టమొదటి కరోనా పేషెంట్ కనికా కపూర్. ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చింది. వెంటనే ఆమెను లక్నోలోని ఐసోలేషన్ వార్డుకు తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. అయితే అసలు కథ వేరే ఉంది. స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన కనికా కపూర్ మొత్తం పెంట చేసింది. కనికా ద్వారా దాదాపు 400 మందికి కరోనా సోకే ప్రమాదం ఏర్పడిందని స్వయంగా అధికారులు ప్రకటించారు.

సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాల్సిన కనినా ఆ పని చేయలేదు. లండన్ నుంచి వచ్చిన తర్వాత ఏకంగా పెద్ద పార్టీకి వెళ్లింది. అందులో వంద మందికి పైగా పాల్గొన్నారు. ఏకంగా పార్లమెంట్ ఎంపీ ఉన్నారు. ఆ తర్వాత అదే ఎంపీ రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు. అక్కడ రాష్ట్రపతితో పాటు అత్యున్నత స్థాయి అధికారులతో అల్పాహార విందులో పాల్గొన్నారు.

అదే పార్టీలో కొందరు ఉత్తరప్రదేశ్ కు చెందిన నేతలున్నారు. వాళ్లంతా తాజాగా జరిగిన యూపీ కేబినెట్ భేటీలో పాల్గొన్నారు. ఇక పార్టీలో మాజీ సీఎం వసుంధరరాజేతో పాటు ఆయన కుమారుడు కూడా ఉన్నారు. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. దాదాపు 400 మంది రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలకు ఇప్పుడు కరోనా ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం వీళ్లంతా స్వీయ నిర్భందంలో ఉన్నారు.

కనికా చేసిన పనికి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. బాధ్యతాయుతంగా, నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఇలా చేయడం ఏంటని అంతా తిడుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒకే ఒక్క వ్యక్తి కనికాను వెనకేసుకొచ్చారు. ఆయనే బప్పిలహరి. లండన్ వెళ్లడానికి ముందు రోజు కనితాతో తను ఓ సాంగ్ రికార్డింగ్ చేశానని, కనికా చాలా మంచి వ్యక్తి అని అంటున్నారు బప్పిలహరి.