మెగా టైటిల్స్ మోజులో తమిళ హీరో

Karthis prefers Mega hero titles?
Tuesday, November 12, 2019 - 16:00

మొన్నటికిమొన్న గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ తో నాని ఓ సినిమా చేసేశాడు. రీసెంట్ గా ఖైదీ టైటిల్ తో కార్తి కూడా ఓ సినిమా చేశాడు. ఇలా మెగా కాంపౌండ్ హీరోల కంటే ముందే, మెగా సినిమా టైటిల్స్ ను బయట హీరోలు  వాడేస్తున్నారు. అయితే ఇప్పుడీ రేసులో కార్తి అందరికంటే ముందున్నాడు. మొన్నటికిమొన్న ఖైదీ అనే టైటిల్ వాడేసిన ఈ హీరో, ఇప్పుడు పవన్ కల్యాణ్ టైటిల్ పై కన్నేశాడు.

అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే కార్తి నెక్ట్స్ మూవీకి తమ్ముడు అనే టైటిల్ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ టైటిల్ తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లకూ మళ్లీ ఈ టైటిల్ ను తెరపైకి తీసుకొస్తున్నాడు కార్తి.

దృశ్యం లాంటి అద్భుతమైన సినిమా తీసిన జీతూ జోసెఫ్ తో ఓ సినిమా చేస్తున్నాడు కార్తి. సిస్టర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమాలో కార్తి రియల్ లైఫ్ వదిన జ్యోతిక, అతడికి అక్కగా నటిస్తోంది. ఈ సినిమాకు తమిళ్ లో తంబి అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారు. అంటే, ఆటోమేటిగ్గా తెలుగులో తమ్ముడు అనే టైటిల్ ఫిక్స్ అయినట్టే కదా. ఇక మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాను క్రిస్మస్ బరిలో దించాలని చూస్తున్నారు. అది కూడా డిసెంబర్ 20న. ఆ తేదీకి బాలయ్య, సాయిధరమ్ తేజ్ సినిమాలు రెడీగా ఉన్నాయి. వాటికి పోటీగా ఈ "తమ్ముడ్ని" రంగంలోకి దించాలని భావిస్తున్నారు.