ఆర్ఆర్ఆర్.. కీలకమైన సీన్ చెప్పేశాడు

A key scene about RRR is revealed by an actor
Saturday, February 22, 2020 - 22:30

ఆర్ఆర్ఆర్ కు సంబంధించి ఇప్పటికే ఓ కీలకమైన సీన్ ఒకటి లీక్ అయిపోయింది. కొమరం భీమ్ గెటప్ లో ఎన్టీఆర్ పులి వెంట పడే సన్నివేశం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అయితే అది ఇలా లీకైన వెంటనే అలా యూనిట్ అప్రమత్తమై డిలీట్ చేసింది. అయినప్పటికీ దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇంకా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇప్పుడీ భారీ ప్రాజెక్టుకు సంబంధించి మరో సీన్ లీక్ అయింది.

ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్-రామ్ చరణ్ మధ్య చాలా సన్నివేశాలున్నాయి. అందులో వీళ్లిద్దరి మధ్య ఓ ఫైట్ కూడా ఉంది. ఆ వీరావేశ సన్నివేశంలో ఎన్టీఆర్ ను రామ్ చరణ్ గట్టిగా కొడతాడు. సినిమాలో ఈ సీన్ ఉందనే విషయాన్ని అందులో నటిస్తున్న ఓ ఆర్టిస్టు బయటపెట్టేశాడు.

ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ.. మాటల మధ్యలో ఆ సీన్ ను లీక్ చేసాడు. తను ఆ సన్నివేశంలో కనిపిస్తానని, తనకు ఓ మంచి పాత్ర దొరికిందని చెప్పిన ఆ ఆర్టిస్ట్.. ఇలా సీన్ ను బయటపెట్టడంతో ఫ్యాన్స్ భగ్గుమన్నారు. ఎన్టీఆర్ ను చరణ్ కొట్టడం ఏంటంటూ అప్పుడే కామెంట్స్ స్టార్ట్ చేశారు.

ఆర్ఆర్ఆర్ కు సంబంధించి ఇలా మరో సీన్ బయటకు రావడంతో.. యూనిట్ మరోసారి అలెర్ట్ అయింది. ఫ్యాన్స్ మధ్య గొడవలు రేపుతున్న ఆ వీడియోను తొలిగించాల్సిందిగా సదరు న్యూస్ ఛానెల్ ను అభ్యర్థించింది. దీంతో ఆ వీడియోను ఆ న్యూస్ ఛానెల్ యూట్యూబ్ పేజీ నుంచి తొలిగించారు. మరోవైపు ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో జరిగిన వాగ్విదాన్ని కూడా ఆర్ఆర్ఆర్ టీమ్ సక్సెస్ ఫుల్ గా డిలీట్ చేయించింది.