అవెంజ‌ర్స్ ఎండ్‌గేమ్‌లో అస్స‌లు ఏముంది

Know all about Avengers: Endgame
Friday, April 26, 2019 - 16:15

మల్టీప్లెక్స్‌ల‌న్నీ కిట కిట. "అవెంజ‌ర్స్ ఎండ్‌గేమ్‌" సినిమా ఎండాకాలంలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఒక హాలీవుడ్ చిత్రానికి తెలుగునాట ఈ రేంజ్ క్రేజ్ అనేది అవతార్ సినిమా తర్వాత ఇపుడే చూస్తున్నాం. మార్వెల్ సంస్థ తీసిన అనేక చిత్రాలు తెలుగునాట బాగానే ఆడాయి. కానీ ఓపెనింగ్స్ పరంగా ఒక మార్వెల్ మూవీ ఇంత బజ్ క్రియేట్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్.

ఈ వీకెండ్ హైదరాబాద్ లోని అన్ని ప్రధాన మ‌ల్టీప్లెక్స్‌ల‌లో అవెంజర్స్ ప్రేక్షకులతోనే నిండిపోనున్నాయి. ఈ హంగామా హైదరాబాద్‌కే పరిమితం కాదు. విజయవాడ వరంగల్, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, కర్నూలు.... ఇలా అన్ని నగరాల్లోనూ ఇంతే హల్ చల్ ఉంది.

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అంటే ఏంటి...
2008లో విడుదలైన ఐరన్ మేన్ సినిమాతో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అనేది మొదలైంది. ముద్దుగా MCU అని పిలుస్తున్నారు. మార్వెల్ నిర్మాణ సంస్థ.. ఐరన్ మేన్, ఆంట్‌మేన్, థోర్, హల్క్, కెప్టెన్ మార్వెల్ వంటి సూపర్‌హీరోల‌ కథలతో సినిమాలు తీయడం మొదలుపెట్టింది. వీటినే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అని అంటారు.

2008లో వచ్చిన ఐరన్ మేన్ సంచలన విజయం సాధించడంతో ఈ MCU జైత్రయాత్ర మొదలైంది. ఈ సిరీస్‌లో రూపొందిన చివరి చిత్రంగా పిలవబడుతోంది అవెంజ‌ర్స్ ఎండ్‌గేమ్‌. అందుకే దీనికి ఇంత క్రేజ్ వచ్చింది.

ఈ సిరీస్‌ ఇంతటితో ఆగిపోతుందా?
ఐతే మార్వెల్ సంస్థ ఈ సిరీస్ ని ఇక్కడితో ఆపుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేం. హాలీవుడ్ కి రీబూట్ అనే ఆప్సన్ ఉంది. అంటే స్పైడర్ మేన్ సిరీస్‌లో అన్ని సినిమాలు అయిపోయాయి అనుకున్న టైమ్‌లో స్పైడర్ మేన్ రీబూట్ అంటూ మళ్లీ మొదలుపెట్టారు. జనం మదిలో బాగా గుర్తుండిపోయిన పాత్రలతో సినిమాలు తీయడం, వాటికి సీక్వెల్‌లు రూపొందించడం, వాటికి రీబూట్లు చేయడం హాలీవుడ్ నిర్మాణ సంస్థల శైలి. డబ్బులు సులువుగా సంపాదించడానికిదే మార్గమని హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్స్ గ్రహించారు.

ఒకపుడు కథాబలమున్న చిత్రాలను, పాత్రల సంఘర్షణలతో కూడిన సినిమాలను ఎక్కువగా తీసేది హాలీవుడ్. ఎపుడైతే హాలీవుడ్ సినిమాలకి అమెరికాలో కన్నా చైనా, ఇండియా వంటి దేశాల్లో కలెక్షన్లు ఎక్కువ రావడం మొదలైందో అప్పట్నుంచి ఇలాంటి సూపర్ హీరోల డిష్యూం డిష్యూ సినిమాలకి ప్రాధాన్యం పెరిగింది.

చైనాలాంటి దేశాల్లో అవెంజర్స్ సినిమా వెయ్యి కోట్ల రూపాయలను సులువుగా సంపాదించగలదు. అంటే అమెరికా మార్కెట్ కన్నా చైనా మార్కెట్ పెద్దది హాలీవుడ్ కి. మరి చైనీయులకి అమెరికా కల్చర్‌తో కూడిన కథలు, కాకరకాయలు చెపితే ఎలా. అందుకే ఈ సూపర్ హీరో చిత్రాల జోరు.చైనా, ఇండియా వంటి మాస్ జనాల్లోకి సినిమాలను తీసుకుపోవాలంటే బోరింగ్ కథ కన్నా సూపర్ హీరోల యాక్షన్ విన్యాసాలే బెటర్ అని హాలీవుడ్ ఎపుడో గ్రహించింది. ఇలాంటి వాటికి భాషాపరమైన, సాంస్కృతపరమైన చిక్కులు ఉండవు. అందరికీ సులువుగానే అర్థమవుతాయి.