కోన వెంకట్ కు వైఎస్ఆర్ ఝలక్

Kona Venkat recalls funny incident about YSR
Wednesday, July 8, 2020 - 13:00

ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి. ఆయనతో అనుబంధం ఉన్న వ్యక్తులంతా ఆ జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటున్నారు. కోన వెంకట్ కు కూడా వైఎస్ఆర్ తో ఓ అనుబంధం ఉంది. అయితే అది తీపి-చేదు మిశ్రమం. ఈ విషయాన్ని స్వయంగా కోన వెంకట్ బయటపెట్టాడు.

ఓసారి అనుకోకుండా విమానంలో వైఎస్ఆర్ ను కలిశాడట కోన. అప్పటికే ఆయన ముఖ్యమంత్రి. కోనను గుర్తుపట్టి తన పక్కనే కూర్చోబెట్టించుకున్నారట. చాలా బాగా మాట్లాడారట. అవన్నీ తనకు మధుర జ్ఞాపకాలన్నాడు కోన. అయితే అదే టైమ్ లో వైఎస్ఆర్ తన గాలి తీసేశారని కూడా చెప్పుకొచ్చాడు.

అదే సంభాషణలో కోనను వైఎస్ఆర్ తన ఇంటికి ఆహ్వానించారట. వైఎస్ఆర్ మేనల్లుడికి కడపలో సినిమా హాళ్లు ఉన్నాయట. సినిమా నిర్మిస్తానని తెగ ఉబలాటపడేవారట. సో.. కోన వచ్చి వైఎస్ఆర్ మేనల్లుడికి హితబోధ చేయాలట. సినిమా ఫీల్డ్ లోకి రావొద్దని, సినిమా ఆలోచన మానుకోవాలని చెప్పాలట. ఇదీ కోనను వైఎస్ఆర్ కోరింది.  

వైఎస్ఆర్ అడిగిన ఆ మాటతో తన గాలి మొత్తం పోయిందని చెప్పుకొచ్చారు కోన. ఇంతకీ విషయం ఏంటంటే.. కోన తీసిన "తోకలేని పిట్ట" సినిమా ఓపెనింగ్ కు వైఎస్ఆర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారట. అప్పట్లో కోన పడిన ఆర్థిక కష్టాల గురించి వైఎస్ఆర్ కు తెలుసట. ఆ కష్టనష్టాలు చెప్పి మేనల్లుడ్ని మందలించాలని వైఎస్ఆర్, కోనను కోరారట.

అలా వైఎస్ఆర్ తో జరిగిన ఒకప్పటి సంభాషణను కోన గుర్తుచేసుకున్నాడు.