నిశ్శబ్దంగా దుష్ప్రచారం!

Kona Venkat says some one is behind negative reports on Nishabdham
Thursday, May 28, 2020 - 21:00

"నిశ్శబ్దం" సినిమాను థియేటర్ కంటే ముందు ఓటీటీకి ఇచ్చేస్తారనే ప్రచారంపై మరోసారి స్పందించాడు ఆ సినిమా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్. ఆఖరి క్షణం వరకు థియేట్రికల్ రిలీజ్ కోసం ప్రయత్నిస్తాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేం అంటున్నాడు.

"చివరి రక్తపు బొట్టు వరకు, ఆఖరి క్షణం వరకు థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తాం. కానీ డబ్బులు పెట్టింది నేను కాదు కదా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి విశ్వప్రసాద్ గారు డబ్బులు పెట్టారు. ఆయన కోణంలో కూడా ఆలోచించాలి. థియేటర్ లో రిలీజ్ చేయకుండా ఆయనైనా ఎన్నాళ్లు ఎదురుచూడగలరు. 2నెలలు చూస్తారు లేదంటే మరో 3 నెలలు చూస్తారు. అప్పటికీ థియేటర్లు ఓపెన్ చేయకపోతే ఏం చేస్తారు. థియేటర్లు ఓపెన్ అయినా మాకు రిలీజ్ డేట్ దొరక్కపోతేం ఏం చేస్తాం? కాబట్టి ప్రస్తుతానికైతే థియేట్రికల్ రిలీజ్ కే కట్టుబడి ఉన్నాం. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చెప్పలేం."

ఇలా నిశ్శబ్దం రిలీజ్ పై మరోసారి క్లారిటీ ఇచ్చాడు కోన. తమ సినిమాపై ఎవరో కావాలనే పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని అనుమానించాడు కోన. తమ సినిమాతో పాటు చాలా సినిమాలు లైన్లో ఉన్నప్పటికీ.. ఒక్క నిశ్శబ్దంపై మాత్రం ఓటీటీ చర్చ జరుగుతోందని, ఇదంతా ఎవరు చేస్తున్నారో అర్థంకావడం లేదన్నాడు.

"కేవలం నిశ్శబ్దం పైనే ఎందుకు ఓటీటీ చర్చ జరుగుతుందో అర్థంకావడం లేదు. మాతో పాటు నానిది V అనే సినిమా ఉంది.  ఉప్పెన అనే మూవీ ఉంది. రామ్ నటించిన రెడ్ సినిమా కూడా ఉంది. ఈ సినిమాలపై జరగని చర్చ, లేవని వివాదాలు.. నిశ్శబ్దం విషయంలోనే ఎందుకు జరుగుతున్నాయో నాకు అర్థం కావడం లేదు. ఎవరైనా క్రియేట్ చేస్తున్నారేమో తెలియదు."