కొరటాలే ప్రొడక్షన్ చూసుకుంటున్నాడా?

Koratala overseeing production of Chiru 152
Wednesday, January 1, 2020 - 23:45

అవును.. చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా, ఈసారి ప్రొడక్షన్ వ్యవహారాలు కూడా కొరటాలే దగ్గరుండి చూసుకోబోతున్నాడు. ఈ మేరకు అటు చిరంజీవి, ఇటు రామ్ చరణ్ కూడా కొరటాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీని వెనక ఓ కారణం కూడా ఉంది.

ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. ఓవైపు రాజమౌళితో ఆ సినిమా చేస్తూ, మరోవైపు తండ్రి సినిమా ప్రొడక్షన్ వ్యవహారాల్ని ఏ రోజుకారోజు చూసుకోలేడు చరణ్. అలాఅని తన స్థానంలో మరో వ్యక్తిని పెట్టలేడు. ఎందుకంటే, ఈ సినిమాకు మరో నిర్మాతగా నిరంజన్ రెడ్డి ఉండనే ఉన్నాడు. అందుకే తన స్థానంలో ఏకంగా కొరటాలనే పెడితే సరిపోతుందని చరణ్ ఓ అభిప్రాయానికొచ్చాడు. చిరు కూడా దీనికి సై అన్నట్టు తెలుస్తోంది.

నిజానికి ప్రొడక్షన్ వ్యవహారాలు కొరటాలకు కొత్తకాదు. జనతా గ్యారేజ్, శ్రీమంతుడు సినిమాలకు డైరక్షన్ డిపార్ట్ మెంట్ తో పాటు ప్రొడక్షన్ పనులు కూడా తనే చూసుకున్నాడు. తన సినిమాల బడ్జెట్స్ విషయంలో కొరటాల చాలా నిక్కచ్చిగా ఉంటాడు. నిర్మాత టెంప్ట్ అయినా తను మాత్రం ఎక్స్ ట్రా ఖర్చుచేయించే రకం కాదు. ఈ ట్రాక్ రికార్డు ఉంది కాబట్టే, కొరటాలకు ప్రొడక్షన్ బాధ్యతలు కూడా అప్పగించారట. ఎలాగూ సెట్ లో చిరంజీవి పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి ఈసారి కొరటాలకు కూడా ఇది అదనపు బాధ్యత అనిపించదు.