కౌశల్యకు అలా కలిసొచ్చింది

Kousalya Krishnamurthy gets good TRP
Friday, February 14, 2020 - 14:45

సెంటిమెంట్ చూపిస్తే స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ పడిపోతారనే విషయం మరోసారి రుజువైంది. ఈసారి ఈ విషయాన్ని కౌశల్య కృష్ణమూర్తి నిజం చేసి చూపించింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమినీ ఛానెల్ లో ప్రసారం చేసిన ఈ సినిమాకు మంచి టీఆర్పీ వచ్చింది. తమిళ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకు 10.10 (అర్బన్) టీవీఆర్ వచ్చింది.

ఐశ్వర్యరాజేశ్ లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ కాదు. వెండితెరపై ఈ సినిమాను ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ బుల్లితెర వీక్షకుల్ని మాత్రం ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది. సెంటిమెంట్ వర్కవుట్ అయితే స్మాల్ స్క్రీన్ పై తిరుగుండదని మరోసారి రుజువైంది. దీనికి తోడు ఆ టైమ్ లో టీవీల్లో పెద్ద సినిమాలు పడకపోవడం కూడా కౌశల్యకు కలిసొచ్చింది.

జెమినీలో వచ్చిన ఈ సినిమా తప్పితే, మరే ఛానెల్ లో కొత్త సినిమాలు ప్రసారం అవ్వలేదు. ఎందుకంటే జెమినీతో పోలిస్తే, మిగతా ఏ ఛానెల్ దగ్గర భారీ స్థాయిలో బడా సినిమాల్లేవు. దాదాపు ఏడాదిగా జెమినీ యాజమాన్యం కొత్త సినిమాల్ని కొంటూనే ఉంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా కొనేస్తోంది. అందుకే నెలలో కనీసం 2 కొత్త సినిమాల్ని అది ప్రసారం చేయగలుగుతోంది. ఇటు స్టార్ మా ఎప్పట్లానే మరోసారి బాహుబలి, ఫిదా లాంటి సినిమాల్ని నమ్ముకోగా.. జీ తెలుగు ఛానెల్ ఇస్మార్ట్ శంకర్, టాక్సీవాలా లాంటి పాత సినిమాల్నే నమ్ముకుంది.