నేను సేఫ్ అంటున్న హీరోయిన్

Kriti Garg says she's safe
Tuesday, March 3, 2020 - 13:00

"రాహు" సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి గార్గ్ నిన్నంతా హాట్ టాపిక్ గా మారింది. ఓ అగంతకుడు చేసిన ఫోన్ కాల్ నమ్మి ఈమె ముంబయి వెళ్లింది. ఆ తర్వాత ఈమె ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో కంగారుపడిన రాహు సినిమా డైరక్టర్ సుబ్బు వేదుల వెంటనే పోలీసుల్ని ఆశ్రయించాడు. ఎట్టకేలకు నిన్న రాత్రికి హీరోయిన్ మిస్సింగ్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది.

దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పేరిట తనకు ఓ అగంతకుడు ఫోన్ చేసిన మాట వాస్తవమే అంటోంది కృతి గార్గ్. ప్రభాస్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఉందని, ముంబయి వస్తే ఆడిషన్స్ చేస్తానని ఆయన చెప్పాడని తెలిపింది. అయితే తను ఆయన్ను కలవడానికి ముంబయి వెళ్లలేదని, తన ఇంటికి మాత్రమే వెళ్లానని అంటోందీమె. బాగా అలసిపోవడం వల్ల ఇంటికెళ్లి పడుకున్నానని, అదే టైమ్ లో నెట్ వర్క్ ఇష్యూ వల్ల దర్శకుడు సుబ్బుకు తన ఫోన్ కనెక్ట్ అవ్వకపోవడం వల్ల అంతా టెన్షన్ పడ్డారని చెప్పుకొచ్చింది.

తనపై ప్రేమ, ఆదరణ చూపించిన టాలీవుడ్ కు థ్యాంక్స్ చెప్పిన కృతి గార్గ్.. అలాంటి నకిలీ ఫోన్ కాల్స్ ను నమ్మొద్దని పిలుపునిస్తోంది. సదరు అగంతకుడు ఓ టీవీ యాంకర్ కు కూడా ఇలానే ఫోన్ చేసి ముంబయి రమ్మన్నాడు. ఆమె అప్రమత్తపై ఆ కాల్స్ ను రికార్డ్ చేసి పోలీసులకు అందించింది. కృతి గార్గ్ మిస్సింగ్ మేటర్ సెటిల్ అయినప్పటికీ.. పోలీసులు మాత్రం అగంతుకుడి కోసం సెర్చింగ్ మొదలుపెట్టారు.