15 కిలోలు తగ్గిన సనన్

Kriti Sanon loses 15 kgs
Tuesday, June 9, 2020 - 17:30

బరువు పెరగడం ఈజీ. తగ్గాల్సి వచ్చినప్పుడే ఆ కష్టం తెలుస్తుంది. హీరోయిన్ అనుష్క ఆమధ్య అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడిన సంగతి అందరికీ తెలిసిందే. అలాంటిది ఇక్కడో హీరోయిన్ కేవలం రెండున్నర నెలల టైమ్ లో అమాంతం 15 కిలోలు తగ్గిపోయింది. తన స్లిమ్ ఫిజిక్ తో అభిమానులతో లైవ్ ఛాట్ కూడా చేసింది. ఆమె పేరు కృతి సనన్.

మహేష్ సరసన "వన్-నేనొక్కడినే" అనే సినిమాలో నటించిన కృతి.. ఓ హిందీ సినిమాలో గర్భవతిగా నటించాల్సి వచ్చింది. ఆ పాత్ర కోసం ఆమె ఏకంగా 15 కిలోల బరువు పెరిగింది. సరిగ్గా ఆ సినిమా షూటింగ్ పూర్తవ్వడం, లాక్ డౌన్ పడడం ఒకేసారి జరిగాయి. దీంతో ఈ లాక్ డౌన్ టైమ్ ను బరువు తగ్గడానికి ఉపయోగించుకుంది కృతి. కేవలం రెండున్నర నెలల టైమ్ లో దాదాపు 15 కిలోలు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

"మిమి సినిమా కోసం నేను బరువు పెరగాలి. అందుకే ఎక్సర్ సైజులు, యోగా మానేశాను. కెలోరీలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకున్నాను. భోజనం తర్వాత స్వీట్స్ కూడా బాగా తినేదాన్ని. ఆకలి లేకపోయినా ఛీజ్ లాగించేదాన్ని. అలా అమాంతం పెరిగిన నేను ఈ లాక్ డౌన్ టైమ్ లో దాదాపు మొత్తం తగ్గించేశాను. జస్ట్ ఇంకో కిలోన్నర తగ్గితే సరిపోతుంది."

ఇలా తను బరువు తగ్గిన విషయాన్ని బయటపెట్టిన కృతి.. పనిలోపనిగా తన డైటీషియన్ ఫొటోను కూడా షేర్ చేసింది. ఇలాంటి డైటీషియన్ ప్రతి ఒక్కరికి అవసరం అంటోంది ఈ ముద్దుగుమ్మ.