మేడే నాడు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌

Lakshmi's NTR to release on May 1st in AP
Friday, April 26, 2019 - 19:45

రాంగోపాల్ వ‌ర్మ‌, ఆయ‌న శిష్యుడు ఆగ‌స్త్య మంజు క‌లిసి డైర‌క్ట్ చేసిన "ల‌క్ష్మీస్ ఎన్టీఆర్" గ‌త నెల‌లోనే విడుద‌ల‌యింది. రిలీజ్‌కి ఒక రోజు ముందు ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు ఈ సినిమాని ఏపీలో రిలీజ్ చేయ‌కూడ‌ద‌ని తీర్పు ఇచ్చింది. ఎన్నిక‌ల నేప‌థ్యంలో సినిమా విడుద‌ల‌పై స్టే విధించింది. దాంతో వ‌ర్మ త‌న సినిమాని తెలంగాణ‌తో పాటు దేశంలోని ఇత‌ర మెట్రో న‌గ‌రాల్లో, ఓవ‌ర్సీస్‌లో తాను అనుకున్న డేట్‌కే రిలీజ్ చేశారు. 

ఏప్రిల్ 11న ఏపీలో ఎన్నిక‌లు ముగిశాయి. ఫ‌లితాలు మే 23న వ‌స్తాయి. దాంతో ఇపుడు ఈ సినిమా విడుద‌ల‌కి ఏపీలో అడ్డంకులు తొలిగాయి. అందుకే మే 1న ఏపీలో రిలీజ్ కాబోతోంద‌ని వ‌ర్మ తాజాగా ప్ర‌క‌టించాడు. ఇప్పటికే ఈ సినిమాని సినిమా ల‌వ‌ర్స్ పైర‌సీ రూపంలో చూసేశారు. 

ఎన్టీఆర్ చ‌ర‌మాంకంలో ల‌క్ష్మీపార్వ‌తి ఆయ‌న జీవితంలోకి ప్ర‌వేశించి ఆయ‌న రెండో భార్య‌గా మారింది. ఎన్టీఆర్ కూతుళ్లు, కొడుకులెవ‌రూ ఆయ‌న‌ని చివ‌రి ద‌శ‌లో చూసుకోలేద‌ని, బాగోగులు ప‌ట్టించుకోలేద‌ని, ల‌క్ష్మీపార్వ‌తి ఆయ‌న‌కి అన్నివిధాల స‌హాయ‌కురాలిగా, సోల్‌మేట్‌గా ఉన్న‌ట్లుగా వ‌ర్మ ఈ సినిమాలో చూపించారు. స‌హ‌జంగానే విల‌న్‌గా చంద్ర‌బాబు నాయుడిని చూపించింది ఈ మూవీ. అందుకే తెలుగుదేశం పార్టీ ఈ సినిమా విడుద‌ల‌ని ఏపీలో లీగ‌ల్‌గా అడ్డుకొంది.

ఇపుడు ఎన్నిక‌లు ముగిశాయి కాబ‌ట్టి తెలుగుదేశం పార్టీ కూడా అభ్యంత‌రాలు చెప్ప‌కపోవ‌చ్చు. ఐనా ఇపుడు ఏపీలో రిలీజ్ కావ‌డం వ‌ల్ల కొత్త‌గా వ‌చ్చే లాభం వ‌ర్మ‌కి లేదు కానీ ఎంతోకొంత వ‌సూళ్లు వ‌స్తాయ‌ని భావిస్తున్నారు నిర్మాత‌లు.