లాక్డౌన్ మూవీ: వికృతి

Lockdown movie: Vikrithi
Thursday, April 23, 2020 - 11:30

వికృతి  (మలయాళం Streaming On: Netflix)

సోషల్ మీడియా వల్ల ప్రయోజనాల మాట అటుంచితే జీవితాలు ఎలా ఛిద్రం అవుతున్నాయో అడపాదడపా చదువుతూనే ఉన్నాం. సోషల్ మీడియాలో ప్రధానంగా యువతులు, మహిళలు విక్టిమ్స్ గా కనిపిస్తుంటారు. సాధారణంగా సెక్స్, బ్లాక్ మెయిలింగ్ లాంటివే ఉంటాయి అనుకొంటూ ఉంటాం. అయితే సోషల్ మీడియా ఎడిక్ట్స్ నిజానిజాలు తెలుసుకోకుండా చేసే పోస్టులు... వాటిపై వచ్చే శాడిస్టిక్ కామెంట్స్  వల్ల చాలా చిన్నపాటి జీవితాన్ని గడిపే అభాగ్యులు ఎలా దెబ్బతింటున్నారో చూపించే వాస్తవిక చిత్రం ‘వికృతి’. 

మలయాళంలో వచ్చిన ఈ సినిమాకు ఒక వాస్తవ ఘటన ఆధారం. ఫేస్ బుక్, ట్విటర్… ఇలా సోషల్ మీడియాలో పగలు రాత్రి తేడా లేకుండా గడిపేస్తూ లైకులు, కామెంట్లు చూసుకొని సంతోషపడిపోయే యూత్ కి చెంపపెట్టు లాంటి సినిమా ఇది. నిజానికి చాలా భారంగా నడిపే అవకాశం ఉన్న ఈ కథను సున్నితమైన రీతిలో తగు మోతాదు వినోదంతోనే నడిపించారు దర్శకుడు ఎమ్సీ జోసెఫ్. ఇతనికి ఇదే మొదటి సినిమా. 

కథ విషయానికి వస్తే- ఎల్డో (సూరజ్ వెంజారమూడు) కొచ్చిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో అటెండర్. ఇతని భార్య ఎల్సీ (సురభి లక్ష్మి) ఓ టెక్స్ టైల్ కంపెనీలో వర్కర్. వీరిద్దరూ మూగ, చెవిటివారే. తమ అవరోధాన్ని పట్టించుకోకుండా ఆనందంగా ఉంటారు. ఓ కొడుకు,  కూతురు. కొడుకు ఫుట్ బాల్ ప్లేయర్ గా సౌత్ జోన్ అండర్ 17 పోటీలకు  వెళ్ళేందుకు సిద్దమవుతూ ఉంటాడు. 

ఇక ఈ కథలో మరో కీలక పాత్ర... ఎల్డోతో సంబంధం లేనిది సమీర్ (సౌబిన్ షాహిర్). అతను గల్ఫ్ నుంచి వస్తాడు. పెళ్లి చేసుకొని తిరిగి వెళ్లిపోవాలి. సమీర్ ఓ సోషల్ మీడియా అడిక్ట్. సెల్ఫీలు, లైవ్ వీడియోలు ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసి సరదాపడే రకం. అదో వ్యసనం. కూతురుకి చిన్నపాటి అనారోగ్య సమస్య వస్తే ఆసుపత్రిలో రెండు రోజులపాటు నిద్రానిప్పులు లేకుండా ఉంటాడు ఎల్డో. మూడో రోజు అతన్ని ఇంటికి పంపి ఆసుపత్రిలో ఉంటుంది ఎల్సీ. ఇంటికి వెళ్ళేందుకు మెట్రో ఎక్కిన ఎల్డో ఒళ్ళు తెలియకుండా నిద్రపోతాడు. అతను నిద్రపోతున్న తీరు చూసి తోటి ప్రయాణీకులు నవ్వుకొంటారు. అదే కోచ్ లో ఉన్న సమీర్ ఫోటోలు తీసి తాగి మెట్రోలో ప్రయాణిస్తున్న ప్రయాణీకుడు అని పోస్ట్ పెడతాడు. అది కాస్తా నిమిషాల్లో వైరల్ అవుతుంది. దాంతో స్కూల్ వాళ్ళు తమ సంస్థ పరువుపోయిందని ఉద్యోగం నుంచి తీసివేస్తారు. కొడుకు ఆ ఫోటోలు చూసి తోటి ఆటగాళ్లు ఎగతాళి చేయడంతో తండ్రిని అసహ్యించుకుంటాడు. బయటకు వెళ్తే చాలు ఎల్డోని చూసి ‘కొచ్చి మెట్రో డ్రంకర్డ్’ అని నవ్వడం, కుర్రాళ్ళు వెటకారంగా సెల్ఫీలు తీసుకొని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఎల్సీకి కూడా తన వర్క్ ప్లేస్ లో ఇబ్బందికరంగా మారుతుంది. 

ఇవేవీ సమీర్ కి సంబంధం లేకుండానే నడిచిపోతుంటాయి. అతను పెళ్లి పనుల్లో ఉంటాడు. ఎల్డో, ఎల్సీలు తమ వేదన చెప్పుకొనే పరిస్థితి లేదు. మాట రాదు మరి. ఎవరికి తమ గోడు, మానసిక స్థితి చెప్పుకోవాలో అర్థం కాదు. కొడుక్కి అయినా అర్థం అయ్యేలా చెప్పాలని ఆ తండ్రి ప్రయత్నిస్తాడు. ఎల్డో గురించి తెలిసిన పొరుగింటాయన ఆ పిల్లాడికి వాస్తవం చెబుతాడు. అప్పుడు ఆ కొడుకు తండ్రిని క్షమాపణ కోరి ఏడుస్తుంటే పొరుగింటిలో ఉన్న అమ్మాయి ఫోటో తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి అసలు విషయం ఘాటుగా రాస్తుంది. ఈ విషయం చూసిన కొందరు సమీర్ కి చెబుతారు. మరో వైపు ఎల్డో, అతని కొడుకు పోలీస్ కేస్ పెడతారు. అక్కడి నుంచి మొదలయ్యే కథను సినిమాలోనే చూడాలి. సమీర్ కి పెళ్లి అయిందా? తిరిగి గల్ఫ్ వెళ్లిపోవాలనే ప్రయత్నం ఏమిటి? ఈ కేసులో సమీర్ తల్లి చిక్కుకొనే పరిస్థితి ఎలా వచ్చింది? లాంటివి కథను క్లైమాక్స్ కి చేరుస్తాయి.

ఒక్క పోస్టు..ఒకే ఒక్క ఫేస్ బుక్ పోస్టు ఆ కుటుంబాన్ని ఎంతటి మానసికవేదనకు గురి చేస్తుందో.. కళ్ల వెంట నీళ్లతో చేయని తప్పుకి సమాజం ముందు తలదించుకునే పాత్రలో సూరజ్ ఒదిగిపోయాడు. (ఇతను జాతీయ స్థాయి ఉత్తమ నటుడుగా అవార్డు కూడా మూడు, నాలుగేళ్ల కిందట పొందాడు. ఎల్సీగా నటించిన సురభి లక్ష్మి సైతం జాతీయ స్థాయి ఉత్తమ నటిగా అవార్డు పొందారు).

నిజం నిద్ర లేచేలోపే అబద్దం ఊరంతా తిరిగి వచ్చేస్తుందనేది సామెత. సోషల్ మీడియాలో ఆ అబద్ధం క్షణాల్లో ప్రపంచం చుట్టేస్తుంది. అసలు వాస్తవమేంటనేది మనకు అనవసరం. ఎవరో పోస్టు పెడతారు ఇంకెవరో వికృతంగా కామెంట్లు పెడతారు. ఈ వికృతత్వం జీవితాలను ఎలా క్షోభకు గురి చేస్తుందో ‘వికృతి’లో చాలా ఎఫెక్టివ్ గా చూపించారు. సూరజ్, సౌబిన్ ల నటన చాలా బాగుంటుంది. కథాగమనం మనల్ని భాషతో సంబంధం లేకుండా సినిమాలో లీనం చేస్తుంది.

Written By: వి.సి

Also Read
లాక్డౌన్ మూవీ: ఏ సెపరేషన్
లాక్డౌన్ మూవీస్: దియా, లవ్ మాక్ టైల్