లాక్డౌన్ మూవీస్: దియా, లవ్ మాక్ టైల్

Lockdown movie watch: Dia and Love Mocktail
Tuesday, April 21, 2020 - 22:45

వెండి తెరపై చలన చిత్రాన్ని చూసే యోగం మరి కొన్నివారాల పాటు లేనట్టే. సినీ ప్రియులు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లాంటి ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ మీదే పూర్తిగా ఆధారపడిపోయారు. కరోనా మహమ్మారి ఇంట్లోనే కట్టిపడేయడంతో భాషా భేదం లేకుండా అన్ని భాషల చిత్రాలను చూసే వెసులుబాటు కలిగింది. పరభాషల్లో మనసును హత్తుకొనేవి... భలే పాయింట్ పట్టుకొన్నారే... సీట్ ఎడ్జ్ (సోఫా ఎడ్జ్/దివాన్ ఎడ్జ్ అనాలేమో) కూర్చేపెట్టే థ్రిల్లర్స్... మనసును మెలిపెట్టేసే కథలు కనిపిస్తున్నాయి. అలాంటి కొన్ని చిత్రాలా సిత్తరాలు ఇవి...

దక్షిణాదిన కన్నడ నుంచి మంచి కాన్సెప్ట్ తో ఉన్న సినిమాలు... చక్కటి ప్రేమకథలు... ఈతరం వాళ్ళ ఆలోచనల, జీవన శైలిని చూపిస్తూనే సెంటిమెంట్ వదలకుండా ఉన్న చిత్రాలు వస్తున్నాయి. కన్నడ భాషతో మనకు పెద్ద ఇబ్బంది ఉండదు. కొంత మేరకు అర్థమవుతూ ఉంటుంది... ఎలాగూ సబ్ టైటిల్స్ ఉంటాయి.

1. దియా (కన్నడ)

దియా స్వరూప్ అనే యువతి జీవితంతో ముడిపడ్డ ప్రేమ కథలే ఈ చిత్రం. ప్రేమ కథలు అని ఎందుకు చెబుతున్నాను అంటే... ముంబైలో మొదలయ్యే దియా కథ ఇది. అంతర్ముఖురాలైన దియా కాలేజ్ లో తన సీనియర్ రోహిత్ పై మనసుపారేసుకొంటుంది. అది ప్రేమో, మరోటో కూడా ఆమెకు అర్థం కానీ సంధిగ్ధంలో ఉండగా ఆ సీనియర్ వేరే దేశం వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళకు తన అపార్ట్మెంట్ లోనే ఎదురు ఫ్లాట్ లో దిగుతాడు. అక్కడ ప్రేమ కథ మొదలవుతుంది. అది ఏ తీరానికి ఎలా చేరింది అనేది ఒక సస్పెన్స్. ఆ తరవాత దియా బెంగళూరు చేరుతుంది. అక్కడ ఆది అనే యువకుడితో పరిచయం మొదలవుతుంది. ఎవరు ఎవరి జీవితాలను ప్రభావితం చేశారు... వీళ్ళ కథ బెంగళూరు నుంచి కార్వార్ అటు నుంచి ముంబైకి ఎలా ఎందుకు చేరింది... అక్కడి నుంచి కార్వార్ కు వచ్చాక ఏమైంది అనేది క్లైమాక్స్.

కథగా కొత్తగా ఏమి చెప్పారు అనే కంటే ఆ కథను కొత్తగా ఎలా చూపించారు అనేది ప్రేక్షకుడిని ఆకట్టుకొంటుంది. ఆశావాద దృక్పథం ఉన్నవారు ఎదుటివారిని ప్రభావితం చేసి వారిని ఉత్సాహంగా నడిపించగలరు. అలాంటివారి మనసు గాయపడితే ఎలా ఉంటుందో దర్శకుడు కె.ఎస్.అశోక్ చూపించారు. ఖుషీ రవి కథానాయిక. పృథ్వీ అంబర్, దీక్షిత్ శెట్టి కథానాయకులు. మనకు తెలిసిన కుర్రాళ్ళ ప్రేమ కథల్లోని ఘటనలు గుర్తుకొస్తాయి.

స్ట్రీమింగ్: అమెజాన్ 

2. లవ్ మాక్ టైల్

ఇదో రొమాంటిక్ డ్రామా. ఆది అనే కుర్రాడి జీవితంలోని మూడు ప్రేమ కథలు ఈ సినిమా. అలాగని ఇదేదో ఆటోగ్రాఫ్ తరహా సినిమా కాదు. 

12వ తరగతిలో ఉండగా రీమా అనే అమ్మాయిపై ఆకర్షణ పెంచుకొంటాడు. ఆ తరవాత ఇంజినీరింగ్ లో ఉండగా జోషిత అనే అమ్మాయితో ప్రేమలో మునిగిపోతాడు. ఆ అమ్మాయిని దక్కించుకొనేందుకు కష్టపడి చదివి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం సంపాదిస్తాడు... ఒక సెకండ్ హాండ్ కారు కొంటాడు. మరి ఈ ప్రేమ కథ ఎందుకు సుఖాంతం కాలేదు.  ఆది జీవితంలోకి నిధి ఎలా వచ్చింది... వాళ్ళ ప్రేమ కథ సఫలమైందా? ఆది జీవితంలో ఎదురైన సంఘటనలు ఏమిటి? వాటిని ఎలా తట్టుకొన్నాడు అనేది ఈ మాక్ టైల్ లో చూడాలి.

ప్రేమలో పడే వయసునిబట్టి చూస్తే ఉండే ఒక తెలియని అమాయకత్వం...  స్వార్థం… వీడలేని బంధం... కలబోసిన మాక్ టైల్ ఇది. ఐటీ ఉద్యోగుల జీవితాల్లో కనిపించే ‘ప్రేమ’... రిలేషన్ షిప్స్ ఎలా ఉంటున్నాయో... ఈ క్రమంలో ఆ కుర్రాళ్ళు ఎదుర్కొనే మానసిక ఒత్తిళ్ళు కనిపిస్తాయి. ఆది పాత్రలో నటించిన కృష్ణ ఈ చ్త్రానికి దర్శకుడు, నిర్మాత. నిధి పాత్రలో నటించిన మిలన నాగరాజ్ ఈ సినిమాకి మరో నిర్మాత. రొమాంటిక్ డ్రామాలు ఇష్టపడేవారికి  ఇది నచ్చుతుంది. 

స్ట్రీమింగ్: అమెజాన్ 

Written By: వి.సి

Also Read: లాక్డౌన్ మూవీ: ఏ సెపరేషన్