లాక్డౌన్ మూవీ: ఏ సెపరేషన్

Lockdown movie watch: A Seperation
Monday, April 20, 2020 - 13:45

సినిమా మొదలైన కొద్దీ సేపటి తర్వాత కథని మలుపు తిప్పే ఒక ఇన్సిడెంట్ ని చూపించి అక్కడ ఒక చిన్న గ్యాప్ ఇచ్చి మళ్ళీ కథని యథావిధిగా కొనసాగించే దర్శకులు ప్రపంచంలో ఇద్దరు కనిపిస్తారు. ఒకరు... ఇరాన్ దర్శకుడు అస్గర్ ఫర్హాది. మరొకరు కెనడాకు చెందిన ఆటమ్ ఇగోయిన్ . చూస్తున్న ప్రేక్షకుడు...  ఆ గ్యాప్ లో, ఒక జర్క్ లాంటి ఎడిటింగ్ కట్ వల్ల ఏదో మిస్ అయిందే అని ఫీల్ అవుతారు. కానీ గ్రిప్పింగ్ నేరేషన్ వల్ల ఆ విషయాన్నీ మర్చిపోతారు. "పే ఆప్"గా క్లైమాక్స్ లో మళ్ళీ చూపిస్తారు. అప్పుడు నివ్వెరపోవడం ప్రేక్షకుడి వంతు. ఈ స్క్రీన్ ప్లే టెక్నీక్ ని అద్భుతంగా చేసి చూపించిన గ్రేట్ డైరెక్టర్ అస్గర్ ఫర్హాది. 

"ఏ సెపరేషన్" అనే సినిమాలో ఈ టెక్నీక్ ని రక్తికట్టించారు అస్గర్. 2011లో విడుదలయిన ఈ ఇరాన్ మూవీకి ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో ఆస్కార్ దక్కింది. ఇక ఇంత గొప్ప స్క్రీన్ ప్లే రాసిన తర్వాత ఆస్కార్ కమిటీ కన్సిడర్ చేయకుండా ఉంటుందా? ఆస్కార్ కమిటీ స్క్రీన్ ప్లే విభాగంలోనూ అస్గర్ కి నామినేషన్ ఇచ్చింది.

కథ: నాదర్, సిమిన్ భార్యాభర్తలు. ఇరాన్ లో ఉన్న రాజకీయ సంక్షోభం, అస్థిరత వల్ల తన కూతురు భవిష్యత్ ఇక్కడ చదువుకుంటే అంతే సంగతులు అవుతుంది అని అనుకుంటుంది సిమిన్. వేరే దేశంలో సెటిల్ అవుదామని భర్త నాదర్ ని పోరుతుంటుంది సిమిన్. కానీ అల్జీమర్స్ తో బాధ పడుతున్న తన తండ్రిని ఇక్కడ వదిలి వెళ్లడం ఇష్టంలేక భర్త ఒప్పుకోడు. దాంతో, విడాకులు కోరుతుంది. ఇరాన్ చట్టాలు, ముస్లిం మతం ప్రకారం విడాకులు పొందడం అంత సులువు కాదు. ఒక చిన్న సంఘటన వారి జీవితాలను మార్చేస్తుంది. 

నిజంగా భార్య అంత నిర్దయగా ఎందుకు ఉంది. భర్త చేసిన తప్పు ఏంటి? చివరకి వాళ్ళ కూతురు ఎవరితో ఉంటుంది? ఈ ప్రశ్నల చుట్టూ తిరిగే ఎమోషనల్ స్టోరీ ... "ఏ సెపరేషన్". 

దర్శకుడు చివర్లో ఏమి చెప్పాడు, ఎవరిదీ తప్పు అనేది ఓపెన్ ఎండెడ్ క్లైమాక్స్ (అంటే ప్రేక్షకుడికే వదిలెయ్యడం). 

అమెజాన్ ప్రైమ్ లో ఉంది. 2 గంటల పై నిడివితో రూపొందిన ఈ సినిమా మనసును కదిలించే చిత్రం. తక్కువ క్యారెక్టర్ లు, చిన్న స్టోరీ లైన్ తో గ్రిప్పింగ్ గా సినిమాలు ఎలా తియ్యాలో చెప్తుంది ఈ మూవీ.

Click here to watch 'A Seperation' on Prime Video