లాక్డౌన్ మూవీ: వరనే అవశ్యముండు

Lockdown Movie Watch: Varane Avashyamund
Sunday, April 26, 2020 - 16:15

వరనే అవశ్యముండు (నెట్ ఫ్లిక్స్)

కరోనా దెబ్బకు ఇళ్ళలో బందీలు అయిపోయినవారిలో యూత్ మాత్రమే ఉంటారా ఏమిటీ..? ఏ విధమైన తారతమ్యాలు లేకుండా అందరినీ ఇళ్ళలో కట్టిపడేసింది ఈ మహమ్మారి. ఓటీటీ ద్వారా కుర్రాళ్లే కాదు పెద్దవాళ్ళు కూడా చూడదగ్గ మంచి చిత్రాలు ఉన్నాయి. 

యూత్ ఎక్కువగా చూసే థ్రిల్లర్స్... హారర్… న్యూ వేవ్ అనే బోల్డ్ సినిమాలు మాత్రమే కాదు మధ్యవయస్కుల్నీ, పెద్దవాళ్ళనీ ఆకట్టుకొనే ఫ్యామిలీ డ్రామాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కేటగిరీలో వచ్చిన చిత్రం ‘వరనే అవశ్యముండు’. ఈ మలయాళ చిత్రం ఫిబ్రవరిలో వచ్చింది. ఈ సినిమా హీరో కం నిర్మాత దుల్కర్ సల్మాన్. 

కథ విషయానికి వస్తే – చెన్నైలో ఉంటే నీనా (శోభన) ఆమె కుమార్తె నిఖిత (కల్యాణి ప్రియదర్శన్)ల జీవితాలతో ముడిపడ్డ కథ ఇది. నీనా ఫ్రెంచ్ ట్యూటర్ గా పనిచేస్తూ ఉంటుంది. సింగిల్ పేరెంట్. బిడ్డ కడుపులో ఉండగానే కుటుంబ కలహాలతో భర్తను విడిచిపెట్టి కూతురుని పెంచిన తల్లి. నిఖిత ఓ ఎమ్.ఎన్.సి.లో ఉద్యోగం చేస్తుంది. పెళ్లీడుకొచ్చింది. అమ్మ చూసిన సంబంధమే చేసుకుంటాను అంటుంది. వాళ్ళు ఉండే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోనే మరో రెండు మలయాళీ కుటుంబాలు ఉంటాయి. అందులో ఒకటి రిటైర్డ్ మేజర్ ఉన్నికృష్ణన్ (సురేశ్ గోపి). ఈయన అవివాహితుడు. షార్ట్ టెంపర్ మనిషి. అయితే అతనిలో ఏదో తెలియని టెన్షన్... ఆడవారితో మాట్లాడాలి అంటే తెలియని గందరగోళం. ఒకడే ఉంటాడు. అపార్ట్మెంట్లో ఉన్నవారందరికీ అతనంటే కాస్త భయం. మరో కుటుంబం... బిబీష్.పి. (దుల్కర్) అనే కుర్రాడిది. అతను తన తమ్ముడు, ఆంటీ రిటైర్డ్ ఉద్యోగిని కం సీరియల్ నటి ఆకాశవాణితో కలిసి ఉంటాడు. ఉన్నికృష్ణన్ తన మానసిక సమస్యకు వైద్యం చేయించుకొంటూ ఉంటాడు. 

ఈ క్రమంలో ఉన్నికృష్ణన్ కీ, నీనాకి మధ్య పరిచయం మొదలవుతుంది. ఈ పరిచయాన్ని నిఖిత ఎలా అర్థం చేసుకొంది? ఆ అమ్మాయికి కుదిరిన సంబంధం ఏమైంది? తల్లిపై ఎందుకు కోపం పెంచుకోండి? బిబీష్ కి తన కొలీగ్ తో ఉన్న ప్రేమ కథ ఎందుకు విఫలమైంది? అసలు బిబీష్ కథ ఏమిటి? అనేది చిత్రంలో చూడాలి.

ప్రేమ, జీవితం, కుటుంబ బంధాల చుట్టూ కథ తిరుగుతుంది. సింగిల్ పేరెంట్ కథలు గతంలోనూ వచ్చాయి. అయితే కథను భిన్నంగా నడిపించాడు దర్శకుడు అనూప్ సత్యన్. బిబీష్, ఉన్నికృష్ణన్, ఆకాశవాణి లాంటి పాత్రలను వినోద ప్రధానంగా నడుపుతూనే వాటి నేపథ్యాన్ని సెంటిమెంటల్ గా చూపాడు. సింగిల్ పేరెంట్ గా ఉన్నవారు  తమ బిడ్డకు మంచి చదువు, కుటుంబ జీవితం ఇవ్వడమే లక్ష్యంగా బతుకుతూ ఉంటారు. వారి సంతోషాలు, సరదాలు ఏవీ పట్టవు. అలాంటివారిని బిడ్డలు అర్థం చేసుకోలేకపోతే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. ముందుగా చెప్పినట్లు ఇది ఫ్యామిలీ డ్రామాలు ఇష్టపడేవారికి నచ్చుతుంది.

By: వి.సి

Also Read
లాక్డౌన్ మూవీ: ఏ సెపరేషన్
లాక్డౌన్ మూవీస్: దియా, లవ్ మాక్ టైల్
లాక్డౌన్ మూవీ: వికృతి