కరోనాతో మ్యారేజ్ మూడొచ్చిందా?

Lockdown to wedlock in Tollywood
Friday, June 19, 2020 - 14:00

కరోనా వచ్చిన తర్వాత వీళ్లకు మూడొచ్చిందా లేక వీళ్లు మెంటల్లీ ప్రిపేర్ అయిన తర్వాత కరోనా వచ్చిందో తెలీదు కానీ.. ఈ లాక్ డౌన్ టైమ్ లోనే చాలామంది స్టార్లు పెళ్లిళ్లకు రెడీ అయిపోతున్నారు. అంతా కరోనా మహత్యం అనుకోవాలేమో.

ముందుగా నిఖిల్ నే తీసుకుందాం. కరోనా రాకముందే ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు కానీ, పెళ్లి టైమ్ కు కరోనా వచ్చింది. దీంతో ఒకసారి తన వెడ్డింగ్ ను వాయిదావేసుకున్నాడు. అయితే కరోనా తగ్గలేదు. దీంతో నిఖిల్ కూడా తగ్గలేదు. లాక్ డౌన్ టైమ్ లోనే గుంభనంగా పెళ్లి చేసుకున్నాడు. గత నెలలోనే తన ప్రియురాలు డాక్టర్ పల్లవిని పెళ్లాడాడు. 

అటు నితిన్ కూడా అంతే. సరిగ్గా పెళ్లి చేసుకుందాం అనే టైమ్ కు కరోనా వచ్చింది. దీంతో ప్రస్తుతానికి ఎంగేజ్ మెంట్ తోనే ఆపాడు. పెళ్లి తేదీ ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ కరోనాను పట్టించుకోకుండా.. వీలైనంత త్వరగానే ఆ ముచ్చట కూడా కానిచ్చేయడానికి రెడీ అవుతున్నాడు. నిఖిల్ లా తను కూడా కరోనాను ఎదిరించాలనే నిర్ణయించుకున్నాడు. ఫియాన్సీ షాలినిని జులైలో పెళ్లాడుతాడు అని అంటున్నారు. 

నిఖిల్, నితిన్ కొంత బెటర్. కరోనా రాకముందే నిశ్చితార్థాలు చేసుకున్నారు. రానా అయితే కరోనా టైమ్ లోనే తన ప్రేమ విషయాన్ని బయటపెట్టాడు. కరోనా టైమ్ లోనే రోకా సెర్మనీ (ఎంగేజ్మెంట్ కి జరిగే మాటముచ్చట) కూడా పూర్తిచేశాడు. ఆగస్ట్ 8న పెళ్లికి కూడా రెడీ అయిపోయాడు.

అటు మెగాడాటర్ నిహారికకు కూడా ఈ కరోనా టైమ్ లోనే మూడొచ్చింది. సరిగ్గా టైమ్ చూసి లాక్ డౌన్ టైమ్ లో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తో లాక్ అయిపోయింది. ఆమె కాబోయేవాడి పేరు చైతన్య జొన్నలగడ్డ. త్వరలోనే పెళ్ళి.  ప్రస్తుతం తన కాబోయే భర్త ఫొటోల్ని వరుసగా రిలీజ్ చేస్తోంది నిహా.

అటు సీనియర్ నటుడు విజయ్ కుమార్ పెద్ద కుమార్తె వనితకు కూడా కరోనా టైమ్ లో మరోసారి మూడొచ్చింది. ఇప్పటికే 2 సార్లు పెళ్లి చేసుకొని సెట్ అవ్వక విడాకులిచ్చిన ఈ నటి, ఇప్పుడు ముచ్చటగా మూడో పెళ్లికి రెడీ అయిపోయింది. ఈనెల 27న పీటర్ పాల్ అనే విజువల్ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ ను పెళ్లి చేసుకోబోతోంది.

ఇలా చాలామంది హీరోహీరోయిన్లకు ఈ కరోనా టైమ్ లోనే మ్యారేజ్ మూడ్ రావడం యాదృచ్చికమే.