విన్నర్‌గా నిలిచిన 'లూజర్‌'

Loser success meet webinar
Monday, June 8, 2020 - 19:45

ఇటీవల 'జీ 5'లో విడుదలైన ‘లూజర్‌’కి సర్వత్రా మంచి స్పందన లభిస్తోంది. వీక్షకులతో పాటు విమర్శకులను మెప్పిస్తోంది. ఈ సందర్భంగా వీడియో కాలింగ్‌ ద్వారా డిజిటల్‌ సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ వెబినార్‌లో 'జీ 5' సౌతిండియన్‌ క్రియేటివ్‌ హెడ్‌ ప్రసాద్‌ నిమ్మకాయల సహా 'లూజర్' టీమ్‌ పాల్గొన్నారు.

'జీ 5' సౌతిండియన్‌ క్రియేటివ్‌ హెడ్‌ ప్రసాద్‌ నిమ్మకాయల మాట్లాడుతూ "ఇప్పటివరకూ 'జీ 5'లో విడుదల చేసిన వెబ్‌ సిరీస్‌లు అన్నిటిలో 'లూజర్‌' టాప్‌లో ఉంది. 'జీ 5'లో మాత్రమే కాదు, సౌతిండియాలో విడుదలైన వెబ్‌ సిరీస్‌లలో 'లూజర్‌' వన్నాఫ్‌ ది బెస్ట్‌ సిరీస్‌గా నిలిచిందని గర్వంగా చెప్పగలను. అభిలాష్‌ కథ చెప్పినప్పుడు 1980 నేపథ్యంలో క్రికెట్‌, 1990 నేపథ్యంలో బ్యాడ్మింటన్‌, 2000లో రైఫిల్‌ షూటింగ్‌ను ఎలా కనెక్ట్‌ చేస్తాడని అనుకున్నా. కంప్లీట్‌ ఎపిసోడ్‌ డీటెయిల్స్‌తో చెప్పినప్పుడు ఇంకా చాలా బావుంది. నటీనటులందరూ చాలా బాగా నటించారు. ప్రియదర్శిని చూసినప్పుడు... తమ్ముడిని కొట్టే సన్నివేశంలో నిజంగానే కొడుతున్నాడా? అనిపించింది. విల్సన్‌ డోర్‌ పగలకొట్టి లోపలకి వచ్చినప్పుడు కోమలీ ప్రసాద్‌ ఇచ్చిన టిపికల్‌ హౌస్‌వైఫ్‌ రియాక్షన్‌... ప్రతి ఇక్కరూ పాత్రల్లో జీవించారు. ఎప్పుడూ పాతబస్తీకి వెళ్లని యానీ, రూబీ పాత్రలో ఎంతో అద్భుతంగా చేసింది. 'జీ 5' ఫ్యామిలీ తరఫున అద్భుతంగా నటించిన 'లూజర్‌' నటీనటులకు, గొప్ప వెబ్‌ సిరీస్‌ అందించిన అభిలాష్‌, ఇతర టెక్నికల్‌ టీమ్‌, నాణ్యతతో కూడిన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ అందించే అన్నపూర్ణ స్టూడియోస్‌కి థ్యాంక్స్‌. వెబ్‌ సిరీస్‌లో సాంగ్స్‌ అంటే కొంచెం డౌట్‌ ఉంటుంది. ఫార్వార్డ్‌ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ, అభిలాష్‌ తొలి పాట వినిపించినప్పుడు మిగతా రెండు పాటలు ఎలా ఉంటాయోనని ఆసక్తిగా ఎదురు చూశా" అని అన్నారు.

'లూజర్‌' దర్శకుడు అభిలాష్‌ మాట్లాడుతూ "నాకు స్నేహితుడు మీర్‌ కస్టమ్‌ ఆఫీసు నుండి ఒక ఎయిర్‌ రైఫిల్‌ గన్‌ తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాడు. ప్రేక్షకులకు క్రికెట్‌, బ్యాడ్మింటన్‌ తెలుసు. ఎయిర్‌ రైఫిల్‌ గురించి తెలియదు. అందులో స్ట్రగుల్‌ గురించి స్నేహితుడి ద్వారా నాకు తెలిసింది. ఆ లైన్‌ తీసుకొని క్యారెక్టర్స్‌, కథ రాసి ‘జీ 5’ ప్రసాద్‌గారికి చెప్పా. ఆయన కథ బాగా నచ్చిందన్నారు. వెంటనే అన్నపూర్ణ స్టూడియోస్‌ సుప్రియ మేడమ్‌కి చెప్పా. ఆవిడకూ కథ బాగా నచ్చింది. నటీనటులు, ఇతర బృందమంతా కథను నమ్మారు. ‘చాలామంది కథ రాయడానికి ఏడాది పట్టిందా?’ అని అడిగారు. మూడు నెలల్లో రాశామంతే! నాతో పాటు భరద్వాజ్‌, శ్రవణ్‌ కథపై వర్క్‌ చేశారు" అన్నారు.

 "ప్రసాద్‌గారికి కంగ్రాట్స్‌. ఇప్పుడు ఆయన 'జీ 5' సౌతిండియా హెడ్‌. ఇక, 'లూజర్‌' ప్రయాణానికి వస్తే స్ర్కిప్టే నా బైబిల్‌. అదే నన్ను ముందుకు నడిపించింది. ఇప్పటివరకూ నేను రైఫిల్‌ షూటర్‌ క్యారెక్టర్‌ చేయలేదు. తొలుత కొంచెం భయపడినా చేశా. అభిలాష్‌, భరద్వాజ్‌, సాయి... అందరూ సిరీస్‌ బాగా రావడానికి కృషి  చేశారు. ఓ 30 రోజులు రైఫిల్‌ షూటింగ్‌లో నీలకంఠగారు నాకు ట్రయినింగ్‌ ఇచ్చారు. గొప్ప బృందంతో కలిసి పని చేశా. వాళ్ల భుజాలపై నేను ప్రయాణించానని చెప్పాలి. శ్రీరామ్‌ అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చాడు. 'లూజర్‌' ఇంత పెద్ద విన్నర్‌ కావడం వెనుక సుప్రిమ మేడమ్‌ పెద్ద పాత్ర పోషించారు. సిరీస్‌ బాగా రావడానికి సుప్రియగారు, ప్రసాద్‌గారు ఎంతో కృషి చేశారు" అని అన్నారు 'లూజర్'లో సూరి పాత్రలో నటించిన ప్రియదర్శి.

'లూజర్'లో విల్సన్‌ పాత్రలో నటించిన శశాంక్‌ 

"విల్సన్‌ కోసం నేను చాలా చేయాల్సి వచ్చింది. తనకు ఏం కావాలి? ఏం వద్దు? అనే విషయంలో అభిలాష్‌ చాలా క్లారిటీతో ఉంటాడు. తను చెప్పింది ఫాలో కావడం పెద్ద ఛాలెంజ్‌. విల్సన్‌ బౌలర్‌ కాబట్టి మూడు నెలలు ట్రయినింగ్‌ తీసుకున్నాను. 'లూజర్'లో బ్యాడ్మింటన్‌ కోచ్‌గా నటించిన చంద్ర, రియల్‌ లైఫ్‌లో నా క్రికెట్‌ బౌలింగ్‌ కోచ్‌. అతని టిప్స్‌ చాలా హెల్ప్‌ అయ్యాయి. లుక్‌ పరంగా చూసుకున్నా... యంగ్‌ విల్సన్‌కి, ఓల్డ్‌ విల్సన్‌కి సంబంధం ఉండదు. యంగ్‌ విల్సన్‌కి 8 కిలోలు తగ్గా. మళ్లీ ఓల్డ్‌ విల్సన్‌ కోసం 16 నుండి 18 కిలోలు పెరిగా. యంగ్‌ విల్సన్‌ సీన్స్‌ షూటింగ్‌ చేశాక... రెండు నెలలు బరువు పెరిగి ఓల్డ్‌ విల్సన్‌ సీన్స్‌ చేశా. ఇప్పుడు బరువు తగ్గుతున్నా. మరో రెండు నెలలకు పర్‌ఫెక్ట్‌ ఫిజిక్‌లోకి వస్తా. ఓవరాల్‌గా 'లూజర్' చేయడం వండర్‌ఫుల్‌ ఎక్స్‌పీరియన్స్‌. మా టెక్నికల్‌ టీమ్‌, ఆడియన్స్‌ రియల్‌ విన్నర్స్‌. ఇప్పుడు మేం ఈ సక్సెస్‌ ఎంజాయ్‌ చేస్తున్నాం."