'నువ్వు నేను'లో హీరో మాధవన్!

Madhavan was the original hero of Nuvvu Nenu, says Teja
Saturday, July 18, 2020 - 16:45

"చిత్రం" సినిమా హిట్టయింది కాబట్టి ఉదయ్ కిరణ్ ను "నువ్వు-నేను" సినిమాతో తేజ మరోసారి రిపీట్ చేశాడని అంతా అనుకున్నారు. కానీ అందులో నిజం లేదంటున్నాడు ఈ దర్శకుడు. వేరే హీరో ఒప్పుకోకపోవడం వల్లనే తిరిగి ఉదయ్ కిరణ్ ను రిపీట్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. మరీ ముఖ్యంగా "చిత్రం" సినిమా తర్వాత ఉదయ్ కిరణ్ కు పెద్దగా అవకాశాలు రాలేదని, అందుకే తనే మరో ఛాన్స్ ఇచ్చానని అన్నాడు.

"నువ్వు-నేను' సినిమాను మాధవన్ తో చేద్దాం అనుకున్నాం. ఆ టైమ్ కి ఉదయ్ కిరణ్ రోజూ ఆఫీస్ కు వచ్చి కింద కూర్చునేవాడు. 'చిత్రం' సినిమా అప్పటికి హిట్టయింది కానీ అతడికి సినిమాలు రాలేదు. రీమా సేన్, ఆర్పీకి అవకాశాలొచ్చాయి కానీ ఉదయ్ కిరణ్ క్లిక్ అవ్వలేదు. దీంతో రోజూ నా ఆఫీస్ కు వచ్చి అవకాశం కోసం కింద కూర్చొని ఎదురుచూసేవాడు. అదే టైమ్ లో మాధవన్ తెలుగు సినిమాలు చేయనన్నాడు. అప్పుడే కింద కూర్చున్న ఉదయ్ కిరణ్ ను చూసి మళ్లీ అతడ్నే హీరోగా పెట్టేశాను. అప్పటివరకు కింద కూర్చున్న ఉదయ్ కిరణ్ ను తీసుకొచ్చి పైన కూర్చోబెట్టాను."

ఇలా నువ్వు-నేను సినిమాలో హీరో సెలక్షన్ ప్రాసెస్ ను వివరించాడు దర్శకుడు తేజ. అంతేకాదు.. హీరోయిన్ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఎంత గమ్మత్తుగా జరిగిందో చెప్పుకొచ్చాడు.

"ముందు ఓ ముంబయి అమ్మాయిని సెలక్ట్ చేశాం. కానీ ఆ అమ్మాయి కండిషన్స్ పెట్టింది. తనకు, తన తల్లికి బిజినెస్ క్లాస్ టిక్కెట్లు, ఫైవ్ స్టార్ హోటల్స్ అడిగింది. అప్పటికే ఆడిషన్ కు వచ్చిన మరో ఆరుగురు అమ్మాయిల్ని చూపించి, వీళ్లలో అస్సలు అందంగా లేని అమ్మాయి ఎవరో చెప్పమన్నాను. మేం ఆల్రెడీ సెలక్ట్ చేసిన అమ్మాయి, అందంగా లేని మరో అమ్మాయిని చూపించింది. వెంటనే ముంబయి అమ్మాయిని పంపించేసి.. అందంగా లేదని చెప్పిన అమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్నాను. ఆ అమ్మాయే అనిత."

"నువ్వు-నేను" సినిమా కోసం ముందుగా సెలక్ట్ చేసిన ఆ ముంబయి హీరోయిన్ ఎవరనే విషయాన్ని మాత్రం తేజ చెప్పలేదు. "నువ్వు-నేను" సినిమాకు కూడా ఆర్పీ పట్నాయక్ ప్లస్ అయ్యాడని చెప్పిన తేజ.. తను కాంబినేషన్లు నమ్మనని అంటున్నాడు.