మగధీర, రాబ్తా... సేమ్ టు సేమ్

Magadheera and Raabta: Same to Same
Thursday, May 25, 2017 - 13:30

మగధీర సినిమాను హిందీలో రీమేక్ చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. హృతిక్ రోషన్ నుంచి షాహిద్ కపూర్ వరకు చాలామంది పేర్లు తెరపైకి వచ్చాయి. సంజయ్ లీలా భన్సాలీ నుంచి సంతోష్ శివన్ వరకు చాలామంది దర్శకుల పేర్లు వినిపించాయి. కానీ ఇప్పటివరకు “హిందీ మగధీర” తెరపైకి రాలేదు. అయితే ఇకపై దాన్ని హిందీలో తీయాల్సిన అవసరం లేదు. మగధీరకు హైటెక్ వెర్షన్ లాంటి సినిమా ఒకటి బాలీవుడ్ లో రెడీ అయిపోయింది. అదే రాబ్తా మూవీ.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్, కృతి సనన్ హీరోహీరోయిన్లుగా నటించిన డ్రామా రాబ్తా. ఈ సినిమా అచ్చుగుద్దినట్టు మగధీరలానే ఉండబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రయిలర్ చూస్తే ఈ విషయం తెలిసిపోతుంది. కాకపోతే బాలీవుడ్డోళ్లు కదా.. స్టోరీకి కాస్త హైటెక్ కలరింగ్ ఇచ్చారంతే. సినిమా మాత్రం సేమ్ టు సేమ్.

తెలుగులో రామ్ చరణ్ పోషించిన పాత్రను సుశాంత్, కాజల్ క్యారెక్టర్ ను కృతి సనన్ ప్లే చేశారు. ఇక కీలకమైన రావు రమేష్ పాత్రను రాజ్ కుమార్ రావు పోషించాడు. అతడికి సంబంధించిన 300 ఏళ్ల ముసలి గెటప్ కూడా రిలీజైంది. ఇలా సినిమాలో అన్నీ సేమ్ టు సేమ్ కుదిరాయి. మరీ దౌర్భాగ్యం ఏంటంటే.. మగధీరలో చరణ్ ఎంట్రీ ఎలా ఉంటుందో రాబ్తాలో సుశాంత్ ఎంట్రీ కూడా అలానే ఉంది. అసలు జనాలకు డౌట్ ఈ ఎంట్రీ సీన్ చూసినప్పట్నుంచే మొదలైంది.

మొత్తానికి అల్లు అరవింద్ సరైన టైం చూసి మేల్కొన్నాడు. వచ్చేనెల 9న ఈ సినిమా రిలీజ్ కానుందనగా.. సరిగ్గా 2 వారాల ముందు రాబ్తా నిర్మాతలపై కేసేశాడు. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని వాదన వినిపించడంతో దీనిపై కోర్టు నోటీసులు జారీ చేసి, జూన్ ఒకటికి కేసును వాయిదా వేసింది. అల్లు అరవింద్ గట్టిగా నిలబడితే రాబ్తా రిలీజ్ ఆగిపోవడం ఖాయం.