బాల త్రిపురమని కి మహేష్ టాటా

Mahesh Babu to provide super dance steps
Friday, November 29, 2019 - 15:30

బాల త్రిపురమని సాంగ్ పేరు చెబితే జనాలు పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు. కానీ అందులో మహేష్ వేసిన ఓ స్టెప్ వీడియో చూపిస్తే మాత్రం ఆ పాటను ఇట్టే గుర్తుపడతారు. ఆ ఒకే ఒక్క స్టెప్పుతో అంత పాపులర్ అయ్యాడు మహేష్. నిజానికి దీన్ని పాపులారిటీ అనేకంటే, అప్రతిష్ట అనడం కరెక్ట్. బ్రహ్మోత్సవం సినిమా రిలీజైన మొదటిరోజు మొదటి ఆటకే ఆ స్టెప్ బయటకొచ్చింది. విపరీతంగా ట్రోలింగ్ కు గురైంది. ప్యాంట్ లోకి చీమలు దూరితే దులుపుకున్నట్టు, దురుద పుడితే గోక్కున్నట్టు అనిపించేలా ఉండే ఆ స్టెప్ చూసి చాలామంది మహేష్ ను తిట్టారు. ఆ టైమ్ లో ఇతర హీరోల ఫ్యాన్స్ ముందు మహేష్ ఫ్యాన్స్ తలెత్తుకొని తిరగలేకపోయారు.

అంతలా తన ఇమేజ్ ను దెబ్బతీసిన డాన్స్ పై ఇప్పుడు మహేష్ ఫోకస్ పెట్టాడు. డాన్స్ విషయంలో ఈమధ్య కాలంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. బ్రహ్మోత్సవం తర్వాతొచ్చిన స్పైడర్, భరత్ అనే నేను, మహర్షి సినిమాల్లో డాన్సింగ్ మెరుపులు లేకపోయినా, ట్రోలింగ్స్ మాత్రం లేవు. స్టెప్స్ విషయంలో ఓకే అనిపించుకున్నాడు మహేష్.

అయితే ఈసారి డాన్స్ పై మరింత శ్రద్ధపెట్టాడు సూపర్ స్టార్. సరిలేరు నీకెవ్వరు సినిమాలో మంచి స్టెప్స్ పడ్డాయి. సరిలేరు సినిమాలో మాస్ గెటప్స్ లో కనిపిస్తున్నాడు మహేష్. అతడి లుక్స్, మేనరిజమ్స్ అన్నీ మాస్ గా ఉండబోతున్నాయి. అలాంటప్పుడు స్టెప్పుల్లో కూడా ఆ ఫ్లేవర్ చూపించాల్సిందే కదా. అందుకే మహేష్ కాస్త గట్టిగానే కష్టపడ్డాడు. ఒకట్రెండు పాటల్లో మహేష్ డాన్స్ ట్రీట్ ఉండబోతోంది. అలా బాల త్రిపురమని ఇమేజ్ ను పోగొట్టుకోవాలని చూస్తున్నాడు మహేష్.