అడ్డాల‌కి ఎన్నో అడ్డంకులు!

Many hurdles for Srikanth Addala's film
Thursday, October 25, 2018 - 23:15

ఫ్లాపులు ఇచ్చిన డైర‌క్ట‌ర్లు చెప్పిన క‌థ‌లు ఓ ప‌ట్టానా ఎవ‌రికీ న‌చ్చ‌వు. మ‌రీ మ‌ఖ్యంగా డిజాస్ట‌ర్స్ ఇచ్చి...మ‌ళ్లీ పాత చింత‌కాయ ప‌చ్చ‌డి క‌థ‌లే చెప్పిన‌పుడు ఆ ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇద్దామ‌నుకున్న నిర్మాత‌కి త‌న‌పై త‌న‌కే అనేక డౌట్లు వ‌స్తాయి. ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ అడ్డాల విష‌యంలో ఇదే జ‌రుగుతోంది. ఫ్యామిలీ క‌థ‌ల‌కి పేరొందిన శ్రీకాంత్ అడ్డాల బ్ర‌హ్మోత్స‌వం సినిమాతో భారీ అప‌జ‌యాన్ని అందించాడు. 

మ‌హేష్‌బాబు అభిమానుల‌కి ఆ సినిమా ఒక పీడ‌క‌ల‌. సీత‌మ్మ వాకిట్లో సిర‌మ‌ల్లె చెట్టు సినిమా త‌ర్వాత అడ్డాల డైర‌క్ష‌న్‌లో న‌టించేందుకు హీరోలంతా పోటీప‌డ్డారు కానీ బ్ర‌హ్మోత్స‌వం త‌ర్వాత అంతా ప‌రార్‌. గ‌త ఏడాది కాలంగా అడ్డాల ఒక క‌థ రాసుకుంటున్నాడు. నిర్మాత అల్లు అర‌వింద్ సినిమాని నిర్మించేందుకు ఒప్పుకున్నాడు ప‌లు కార‌ణాల వ‌ల్ల‌. 

ఐతే అల్లు అర‌వింద్‌కి అడ్డాల చెప్పిన క‌థ బేసిక్‌గా న‌చ్చినా.. ఆయ‌న ఖాతాలో ఉన్న హీరోలెవ‌రికీ న‌చ్చ‌లేదు. దాంతో ఆ క‌థ‌కి ఇపుడు ఎన్నో మార్పులు చేయించాడ‌ట అర‌వింద్‌. ఫైన‌ల్‌గా శ‌ర్వానంద్, ఆ రేంజ్ హీరోల‌కి సెట్ చేసేందుకు గీతా ఆర్ట్స్ సంస్థ ప్ర‌య‌త్నిస్తోంది. 

ఐతే అడ్డాల సినిమా సెట్స్‌పైకి వెళ్లే ప్రాసెస్‌లో ఇంకా ఎన్నో అడ్డంకులున్నాయి. ముఖ్యంగా హీరోలు ఒప్పుకోవ‌డ‌మే పెద్ద స‌మ‌స్య‌. ప్ర‌స్తుతానికి అడ్డాల సినిమా విష‌యంలో ఇంకా ఏ క‌ద‌లిక లేదు.